డబ్బింగ్, స్ట్రైట్ సినిమాల హడావుడిలో.. హిట్లు, ఫ్లాపుల నిమిత్తం లేకుండా… ఎక్కడా విరామం లేనట్టుగా సాగిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది నిర్మాత సి.కల్యాణ్ కెరీర్. ఈ మధ్యకాలంలోనే.. ''ఉత్తమవిలన్'' వంటి డబ్బింగ్ సినిమాను, ''జ్యోతిలక్ష్మి'' వంటి స్ట్రైట్ సినిమాను విడుదల చేసి.. షూటింగ్ దశలో ఉన్న రెండు మూడు సినిమాల్లో నిర్మాతగా భాగస్వామి అయిన కల్యాణ్ ఇప్పటి వరకూ ప్రొడ్యూస్ చేసిన సినిమాల సంఖ్య రమారమీ యాభైకిపైనే ఉంటుంది! నంబర్ పరంగా కల్యాణ్ ఆ స్థాయిలో ఉన్నాడు. ఇండస్ట్రీలో వంద సినిమాలు, యాభై సినిమాలు వంటి ఫీట్లకు ప్రత్యేక గుర్తింపే ఉంటుంది.
అయితే కల్యాణ్ విషయంలో అలాంటి హడావుడి పెద్దగా కనపడదు. కానీ ఈ ప్రొడ్యూసర్ ను కదిలిస్తే.. పాత కొత్త అనుభవాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. అనేక మంది దర్శక, హీరోలతో కలిసి పనిచేసిన ఈయన వారి వారి గురించి ఆసక్తికరమైన కథలే చెబుతారు. ఇలా ఆయన ప్రస్తావించే వాటిలో కొందరి ప్రముఖుల కథలు కూడా ఉన్నాయి. నిర్మాతగా తను రూపొందించిన స్ట్రైట్ సినిమాల గురించి ప్రస్తావిస్తే కల్యాణ్.. నందమూరి హరికృష్ణ, హీరో నితిన్, దర్శకుడు కృష్ణవంశీ, రచయిత చిన్ని కృష్ణ వంటి వాళ్ల పేర్లను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. వీళ్లను ఒక రేంజ్‌లో తలుచుకుంటాడు ఈ నిర్మాత.
ఎందుకంటే.. వీళ్లు ఆయనకు మిగిల్చిన అనుభవాలు అలాంటివట! చాలా సంవత్సరాల కిందట.. ఒక సారి కల్యాణ్, ఎడిటర్ మోహన్ అప్పటికి ఇంకా రచయితగా పెద్ద పేరు లేని చిన్నికృష్ణ కలిసి చెన్నైలో ఒక సినిమాకు వెళ్లారట. ఆ సినిమా బాగా నచ్చి.. కల్యాణ్ ఎడిటర్ మోహన్ సహకారంతో ఆ సినిమా రైట్స్‌ను కొన్నారు. దాని నిర్మాణాన్ని చేపట్టాడు.. కొంత సినిమా పూర్తయ్యాకా కల్యాణ్‌కు అందిన షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే.. తాము ఆ రోజు చెన్నైలో చూసిన ఆ సినిమా కథనే కాస్త అటూ ఇటూ చేసి.. రచయిత చిన్ని కృష్ణ బాలకృష్ణకు వినిపించాడని… ఎలాంటి రైట్స్ కొనకుండానే ఆ సినిమా రూపొందించేశారని, తమిళ సినిమా హక్కులు కొని.. ఇప్పుడు తను వెర్రివాడిని అయ్యానని కల్యాణ్‌కు అర్థమయ్యిందట!
అవతల ఇదే కథతో బాలయ్య సినిమా రెడీ అయిపోయింది. ఇప్పుడు రీమేక్ అంటూ తను అదే కథనే తెరకెక్కించి సినిమా ప్రాడ్యూస్ చేస్తే చేతికి మిగిలేది చిప్పే! దీంతో.. అప్పటికిప్పుడు కథను మార్చేసి.. అదే క్యాస్ట్ తో కల్యాణ్ వేరే సినిమా తీసుకున్నాడట. ఆ విధంగా ఒక రోజు తనతో పాటు సినిమాకు తీసుకెళ్లినందుకు చిన్నికృష్ణ తీవ్రమైన నష్టాన్నే మిగిల్చాడని కల్యాణ్ ఒకసారి మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో నందమూరి హరికృష్ణ సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాకా.. ఆయన హీరోగా సినిమాలు తీసిన వారిలో కల్యాణ్ ఒకరు. ''స్వామి'' అనే ఒక కళాఖండాన్ని రూపొందించారు. ఆ సినిమాకు హరికృష్ణ దాదాపు అరకోటి రూపాయల పారితోషకాన్ని పొందారట.
సినిమా విడుదల సమయానికి కొంత సొమ్మును పెండింగ్ పెట్టారట. సినిమా విడుదల అయ్యింది.. ఆ సంవత్సరానికి అదొక డిజాస్టర్‌గా మిగిలింది. అయితే హరి మాత్రం తన డబ్బు తనకు ఇవ్వాలని పట్టుబడ్డాడట. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని కల్యాణ్ చెప్పగా.. తనకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోవడంపై నందమూరి హరికృష్ణ చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధం అయ్యారని.. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో తను డబ్బు చెల్లించాల్సి వచ్చిందని కల్యాణ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ''చందమామ'' సినిమా ప్రొడ్యూసర్ కల్యాణే. ఆ సినిమా గనుక హిట్ అయితే.. మంచి పారితోషకం ఇస్తానని కల్యాణ్ కృష్ణవంశీకి హామీ ఇచ్చారట. ఆ సినిమా విడుదల అయ్యింది.. అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో కృష్ణవంశీ తనమీద పడ్డాడని.. ముందు ఇచ్చిన హామీకి తగ్గట్టుగా వసూలు చూసుకున్నాడని.. వాస్తవంగా చందమామ సినిమా కమర్షియల్‌గా పూర్తి స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో తనకు మిగిలింది నష్టాలేనని కూడా కల్యాణ్ అంటారు!
హిట్టైందని చెప్పి అందరూ తన నుంచి వసూలు చేసుకెళ్లారని.. ఓవరాల్‌గా తను ''చందమామ''తో నష్టపోయానని అంటారు. అలాగే కల్యాణ్ నిర్మించిన మరో కళాఖండం ''ఆటాడిస్తా'' నితిన్ , కాజల్ హీరోహీరోయిన్లుగా రూపొందిన డిజాస్టర్ ఇది. ఈ సినిమా విషయంలో కూడా కల్యాణ్‌కు మిగిలింది చేదు అనుభవమే అని తెలుస్తోంది. కదిలిస్తే.. నిర్మాతగా తను పడిన ఇలాంటి పాట్లను ఎన్నింటినో వివరిస్తారు చిల్లర కల్యాణ్.