Advertisement


Home > Movies - Movie Gossip
హతవిధీ.. ఇలా అయితే ఎలా?

స్పైడర్, అజ్ఞాతవాసి ఈ రెండు సినిమాలు టాలీవుడ్ కు మరచిపోలేని షాక్ లు. తెలుగు సినిమా మార్కెట్ వంద కోట్ల రేంజ్ దాటిన తరువాత వచ్చిన సినిమాలు ఈ రెండూ. కానీ రెండూ బకెట్ తన్నేసాయి. కానీ ఈ రెండు సినిమాలూ ఇంతలా బకెట్ తన్నేస్తాయని ఎవ్వరూ ఊహించలేదు.

మురుగదాస్-మహేష్ బాబు కాంబినేషన్ అనగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే మురగదాస్ మరీ అద్భుతమైన కమర్షియల్ సినిమా తీయడు అని ఎక్కడో చిన్న డౌట్ కొడుతూ వుండేది. కానీ ఎక్కడో చిన్న ఆశ, కనీసం ఏవరేజ్ సినిమా అన్నా అవుతుంది కానీ, డిజాస్టర్ కాదు అని. కానీ ఘోరంగా కొట్టేసింది దెబ్బ.

ఇక అజ్ఞాతవాసి అయితే అస్సలు వన్ పర్సంట్ కూడా డవుట్ లేదు. త్రివిక్రమ్ మీద నమ్మకం అలాంటిది. సినిమా సెన్సారు అయ్యేవరకు ఎక్కడా డవుట్ వాసనే లేదు. సినిమా ఆలస్యం అయింది. ఖర్చు పెరిగిపోతోంది. ఇలాంటి వార్తలే కానీ, సినిమా గాడి తన్నేస్తోంది అన్న చిన్న గ్యాసిప్ కూడా లేదు.

సెన్సారు అయిన తరువాత నుంచి అసలు వైనం వినిపించడం ప్రారంభమైంది. సినిమా భయంకరంగా వుందన్న వార్తలు వినిపించడం మొదలైంది. కానీ అప్పటికీ జనం నమ్మలేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ మధ్య వున్న వైరాల వల్ల ఇలాంటి వార్త పుట్టింది అనుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ మరీ దారుణమైన సినిమా తీస్తాడని ఎవరికీ అనుమానం లేదు. కానీ అదే జరిగింది. అజ్ఞాతవాసి టోటల్ గా ఫెయిల్ అయింది.

పండగ సీజన్ లో కూడా, పండగ రోజుల్లో కూడా హవుస్ ఫుల్ కావడం లేదంటే ఏమనుకోవాలి? 135కోట్ల పెట్టుబడికి కనీసం 40కోట్లు దాటడం కష్టం అని వినిపిస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఒకప్పుడు పవన్ సినిమా ఫ్లాప్ అయినా 60-70కోట్లు అన్న మాట వినిపించేది. ఇప్పుడు పవన్ సినిమా ఫ్లాప్ అయితే ఇక అంతే సంగతులు అని కొత్త మాట వినిపిస్తోంది.

సోషల్ మీడియా జోక్యం

గతంలోకి ఇప్పటికీ తేడా సోషల్ మీడియా. సినిమా బాగా లేకుంటే టాక్ క్షణాల్లో అమెరికా నుంచి అంతర్వేది వరకు పాకిపోతోంది. అజ్ఞాతవాసి సినిమా అమెరికాలో షో ముగిసిన మరుక్షణం టాక్ పాకిపోయింది. సినిమా పై నిపుణులు, జర్నలిస్టులు, సమీక్షకులు ఇంకా గొంతులు, కలాలు సవరించుకోక ముందే, కామన్ ఆడియన్స్ ఫేస్ బుక్ ల్లో, వాట్సప్ ల్లో తమ తమ అభిప్రాయాలను నింపేసారు. 

నింపేయడం కాదు, అందులో వాళ్ల సృజన కూడా చూపించేసారు. దాంతో న్యూట్రల్ ప్రేక్షకులు థియేటర్ కు దూరం అయిపోయారు. పైగా తొలి రోజు టికెట్ రేట్లు ఎక్కువ కావడంతో కూడా చాలా మంది సినిమాకు దూరంగా వున్నారు. ఎప్పుడైతే భయంకరమైన టాక్ స్ఫ్రెడ్ అయిందో, ఇక వదిలేసారు. మరోపక్క పవన్ పై కనిపించని రాజకీయ ముద్ర బలంగా పడిపోయింది. 

రాజకీయ ముద్ర

ఇటు వైకాపా, అటు తేదేపా జనాలు కూడా ఈ సినిమా హిట్ కాకూడదనే కోరుకున్నారన్నది ముమ్మాటికీ వాస్తవం. ఈ సినిమా హిట్ అయితే పవన్ ఇంకా ఎదిగిపోయి, రాజకీయంగా తమకు ఇంకా టెర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్ కు వెళ్తారని తేదేపా అభిమానులు భావించారు. జగన్ ను విమర్శించడం వల్ల వైకాపా అభిమానులు కలత చెందారు. మరోపక్క రెండు ప్రధాన సామాజిక వర్గాలు కూడా పవన్ పట్ల వ్యతిరేక వైఖరితో వున్నాయి.

సినిమా బాగుంటే..

సినిమా బాగుంటే ఇవేమీ పనికిరావు. పటాపంచలయిపోతాయి. కానీ ఎప్పుడయితే సినిమా గాడి తన్నేసిందో, అన్ని ఈక్వేషన్లు పనిచేసాయి. సినిమాను పాతాళానికి తొక్కేసాయి. నిజానికి సినిమా విడుదలకు ముందు పవన్ రాజకీయ పర్యటన పెట్టుకుని, జగన్ ను తిట్టకుండా వుండాల్సింది. మధ్యలో కాస్త అటు ఇటుగా తెదేపాను కూడా మాటలన్నారు. కానీ మళ్లీ సర్దుకున్నారు. కానీ అప్పటికే పవన్ అంతరంగం అర్థమై, జనాలు జాగ్రత్త పడ్డారు. సినిమాకు జరగాల్సిన డామేజీ జరిగిపోయింది.

పవన్ ఆలోచించుకోవాలి

పవన్ కు సినిమాలు చేయడం అంతగా ఆసక్తి లేదు అని క్లియర్ అయిపోతోంది. ఆయన ఏదో అన్యమనస్కంగా నటిస్తున్నట్లు సినిమాలు చెబుతున్నాయి. అంత ఇష్టం లేనపుడు నటించడం ఎందుకు? సినిమాలు వదిలేయవచ్చు కదా? డ్యాన్స్ లు చేయను, ఫైట్లు చేయను, కదలకుండా డైలాగులు చెబుతాను.

పాటలకు లిప్ సింక్ కూడా ఇవ్వను అంటే, ఇంక ఇరవై కోట్లు ఎందుకోసం? కేవలం ఆయనకు వున్న అభిమాన జనాన్ని టోకున నిర్మాతకు అప్పజెప్పడం కోసం అనుకోవాలా? అభిమానులు వంద వంద వంతున టికెట్ లు కొంటే అందులో తన వాటాను, నిర్మాత నుంచి ముందుగా అందుకోవడం కోసం అనుకోవాలా?

ఇక మిగిలినవి ఆ రెండూ

ఇక మరో రెండు సినిమాలు వున్నాయి. ఒకటి మహేష్-కొరటాల శివ భరత్ అనే నేను. రెండవది రామ్ చరణ్-సుకుమార్ రంగస్థలం. భరత్ అనే నేను సినిమాకు మహేష్ లైనప్ బాగాలేదన్నది సమస్య. ఇదేం సబ్జెక్ట్ నో అని అనుమానం. ఇది కూడా లార్గో వించ్ కు కాపీయే అని, రాజకీయ వారసుడు తన ఐడెంటిటీని రుజువు చేసుకోవడం అని వినిపిస్తోంది. కొరటాల శివ మీద మంచి ఆశలు వున్నాయి. అందువల్ల కాస్త ధైర్యం.

ఇక సుకుమార్ రంగస్థలం. ఆయన రెండేళ్లుగా చెక్కుతున్నారు. ఆ మధ్య వచ్చిన సమంత స్టిల్స్, గేదెలు, ఆ గళ్ల లుంగీ గెటప్ లు చూసి ఒక పక్క డవుట్ కొడుతోంది. మరోపక్క వైవిధ్యంగా ఏదో చేస్తున్నారన్న ఆశ కలుగుతోంది.

ఈ రెండు సినిమాలు అయినా హిట్ కావాలి. బాగుండాలి. లేదూ అంటే ప్రేక్షకులకు ఇక కాంబినేషన్ల మీద, పెద్ద సినిమాల మీద నమ్మకం పోతుంది. టాలీవుడ్ మార్కెట్ మళ్లీ 100కోట్లు ఆవల బదులు అరవై , డెభై కోట్లకు వచ్చేస్తుంది.