ఈ మధ్యకాలంలో మలయాళంలో వచ్చిన థ్రిల్లర్లలో హెలెన్ ఒకటి. ఈ సినిమాకు అటు అవార్డులు, ఇటు డబ్బులు బాగానే వచ్చాయి. అంతే కాదు అటు తమిళ, ఇటు కన్నడలో రీమేక్ వర్క్ ప్రారంభమైపోయింది. తెలుగులో కూడా ప్రారంభమైపోయేదే కానీ , కరోనా అడ్డం పడింది. లేదూ అంటే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రారంభమైపోయేది. నిజానికి అనుపమ పేరు అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ ఆమెనే మెయిన్ లీడ్ కు అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
అయితే హెలెన్ సినిమా తెలుగుకు ఓకెనా? అన్నది డిస్కషన్ పాయింట్. ఈ మధ్య తెలుగులో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిలు తప్పిపోవడం మీద. హెలెన్ కూడా అలాంటి వాటిల్లో ఒకటి. ఈ సినిమా కనుక తెలుగులో రీమేక్ చేస్తే, చేయడానికి తాను రెడీ అని వాలంటీరీగా ముందుకు వచ్చింది అనుపమ పరమేశ్వరన్.
అయితే మలయాళ మాతృకలో క్యూట్ గా, టూ యంగ్ గా వున్న ఫేస్ మనకు కనిపిస్తుంది. తెలుగులో అలాంటి ఫేస్ కావాలంటే కొత్తగా వస్తున్న ఉప్పెన హీరోయిన్ లాంటి అమ్మాయి దొరకాలి. అనుపమ అంత సూట్ అవుతుంది అనిపించదు మలయాళ సినిమా చూసిన వాళ్లకు.
పైగా మలయాళ సినిమా తొలిసగం అంతా పరమ రోటీన్ గా, చప్పగా సాగుతుంది. ఆ తరవాత అసలు గ్రిప్పింగ్ నెరేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇందులో కూడా ఎక్కువ ఎమోషనల్ కంటెంట్ తక్కువ థ్రిల్లింగ్ కంటెంట్ వుంటుంది. అందువల్ల యాజ్ ఇట్ ఈజ్ గా రీమేక్ చేస్తే తెలుగుకు సెట్ అవుతుందా? అన్నది అనుమానం.
ఆరంభంలో అనుపమ ఈ ప్రాజెక్టును తనే స్వయంగా ఓ సంస్థకు రికమెండ్ చేసింది. కానీ వాళ్లు తెలుగుకు అంత సెట్ కాదని వదిలేసారు. కానీ తెలుగు హక్కులు కొన్న నిర్మాత పివిపి మాత్రం తన టీమ్ తో సరైన ఛేంజెస్ చేసి తెలుగులో చేసే ప్రయత్నంలో వున్నారు.