హీరోల మీటింగ్ లో ఏం జరిగింది?

టాలీవుడ్  హీరోలు న్యూస్ చానెళ్లను ఎలా కట్టడి చేయాలా? అని చూస్తుంటే, ఛానెళ్ల జనాలు హీరోల ప్రయత్నాలకు ఎలా బ్రేక్ వేయాలా? అని చూస్తున్నాయి. చానెళ్లు నేరుగా కాకుండా, తమ కీలక సిబ్బంది ద్వారా,…

టాలీవుడ్  హీరోలు న్యూస్ చానెళ్లను ఎలా కట్టడి చేయాలా? అని చూస్తుంటే, ఛానెళ్ల జనాలు హీరోల ప్రయత్నాలకు ఎలా బ్రేక్ వేయాలా? అని చూస్తున్నాయి. చానెళ్లు నేరుగా కాకుండా, తమ కీలక సిబ్బంది ద్వారా, లేదా తమ అనుకూల అనునాయుల ద్వారా సోషల్ నెట్ వర్క్ ల్లోకి, న్యూస్ వింగ్ ల్లోకి, వెబ్ సైట్ల లోకి వార్తలు వదులుతున్నారు. మొన్నటికి మొన్న ఇండస్ట్రీ మీట్ లో అల్లు అరవింద్ చానెళ్ల బహిష్కరణ ప్రతిపాదిస్తే చాలామంది వ్యతిరేకించారని వార్తలు పుట్టించారు.

ఇప్పుడు హీరోల సమావేశం ముగియగానే, హీరోల మధ్య బ్యాన్ పై అభిప్రాయ బేధాలు వచ్చాయని, నిలువునా రెండుగా చీలారని వార్తలు పుట్టించారు. నిజానికి అసలు విషయం వేరు. జరిగిన వాస్తవాలు వేరు. ఇండస్ట్రీ మీట్ లో న్యూస్ చానెళ్ల మీద అందరికన్నా ఎక్కువగా ధ్వజమెత్తింది అక్కినేని సుప్రియ, నందినీరెడ్డి లాంటి వారు. ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్ల మీద కూడా ధ్వజమెత్తారు. అల్లు అరవింద్ ఆరోజు కూడా హడావుడిగా, ఏ నిర్ణయం తీసుకోవద్దనే చెప్పారు. అందుకే 25 మందితో కమిటీ వేసారు.

కానీ బయటకు వచ్చిన వార్తలు మాత్రం అరవింద్ కు ఇండస్ట్రీ షాక్ ఇచ్చినట్లు వచ్చాయి. ఈ వార్తలను కావాలని కొన్ని చానెళ్లు తమ తమ అనునాయుల ద్వారా పుట్టించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరోల సమావేశం మీద కూడా ఇదే ప్రచారం స్టార్ట్ చేసేసారు. నిజానికి హీరోల సమావేశం జరిగిన తరువాత ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడానికి లేకుండా ముందే ఓ మాట అనేసుకున్నారు.

పెద్ద హీరోలు వెంటనే మాట్లాడేంత సీన్, యాక్సెస్ ఎవరికీ లేదు. మిడిల్, స్మాల్ హీరోలు ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని వాట్సప్ లో హాయ్.. బిజీ లాంటి మెసేజ్ లతో కొందరికి సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. ఒకరిద్దరు మాత్రం కాస్త షేర్ చేసుకోగలిగారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. ‘మన సహకారం లేకుండా ఇండస్ట్రీ ఏ నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్నా నడవదు. అందువల్ల ముందు మనం ఏమనుకుంటున్నాం? మన అభిప్రాయం ఏమిటి? అన్నది క్లియర్ గా ఇండస్ట్రీకి తెలియచేస్తే, వాళ్లు (చాంబర్) ముందకు వెళ్తారు అని మెగాస్టార్ చిరంజీవి ఓపెనింగ్ కామెంట్స్ గా చెప్పినట్లు తెలుస్తోంది.

దీనికి ఒకరిద్దరు సీనియర్ హీరోలు, సమస్య తీవ్రంగానే వుందని, కానీ వికటించకుండా, రివర్స్ కాకుండా నిర్ణయం వుంటే బాగుంటుదనే అభిప్రాయానికి వచ్చారు. సినిమా అన్నది ఎంటర్ టైన్ మెంట్ కనుక, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకే ప్రయారిటీ ఇస్తూ, న్యూస్ చానెళ్లను వదిలేస్తే సరిపోతుందని, దీనికి బ్యాన్ లాంటి పెద్ద పదాలు అనవసరం అనే అభిప్రాయం కూడా వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కేవలం ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకే ప్రకటనలు, సినిమా కార్యక్రమాలు, సినిమా ఇవ్వాలన్న ఇండస్ట్రీ ఆలోచనను కూడా సమావేశంలో చర్చించారు. 

అయితే తమిళనాట సినిమా-టీవీ వ్యవహారాలు ఎలా వున్నాయన్నది కూడా ఓసారి అవలోకించాలన్న అభిప్రాయం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా హీరోల మద్దతు లేకుండా ఇండస్ట్రీ చర్యలు అమలు కష్టం కాబట్టి, హీరోలు ఓ మాట మీదకు వచ్చి, తమ అభిప్రాయం తెలియచేస్తే, ఆ విధంగా ఇండస్ట్రీ ముందు వెళ్తుందని, ఇందుకోసం మరోసారి అవసరం అయితే సమావేశం అవుదామని అనుకుని, ముగించినట్లు తెలుస్తోంది.

కానీ అప్పుడే హీరోలు నిలువునా చీలిపోయారని వార్తలు బయటకు వచ్చేసాయి. దీని వెనుక చానెళ్ల మంత్రాంగం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.