వినేవాడు చెప్పేవాడికి లోకువ అన్నది సామెత. ఎదుటి మనిషికి నీతులు చెప్పడంలో మన హీరోలకు మించిన వారు లేరు. తెరమైన బీభత్సమైన హ్యుమానిటీ, వీరత్వం కనిపిస్తాయి. కానీ ఆఫ్ లైన్ లో అవన్నీ మాయం అయిపోతాయి. చైనా తో భారత్ తగాయిదా నేపథ్యంలో ఇక బాయ్ కాట్ చైనా అని, స్వదేశీ బ్రాండ్స్ అంటూ సుభాషితాలు, సూక్తి ముక్తావళి వల్లిస్తున్నారు కొందరు హీరోలు.
నిజానికి టిక్ టాక్ దగ్గర గట్టి పారితోషికాలు తీసుకుని, అడ్డమైన విడియోలు చేసింది టాలీవుడ్ జనాలు కాదా? అప్పుడు చైనా గుర్తుకురాలేదా? సబ్బులు, పేస్టులు స్వదేశీ అంటున్నారు. అసలు సినిమాకు ముందు వీళ్ల డ్రెస్ లు అన్నీ ఎక్కడ కొంటున్నారు. ఊ అంటే చాలు దుబాయ్ లో వాలిపోవడం లేదా?
కళ్లజోళ్లు, వాచీలు, దుస్తులు, ఇవన్నీ విదేశాలవే వాడుకుంటూ, సబ్బులు, పేస్టులు దగ్గర మాత్రం తాము స్వదేశీ అంటూ ఫోజులు కొడుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. చేయడానికి సినిమాలు లేవు. ఏదో విధంగా వార్తల్లో వుండాలి. అందుకే చిన్న, బడుగు హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు ఇన్ స్టా, ట్విట్టర్లలో ఏదో ఒక హడావుడి చేస్తున్నారు. అందుల్లో ఈ స్వదేశీ సూక్తి ముక్తావళి తప్ప మరేం కాదని పెదవి విరుస్తున్నారు.
అసలు ముంబాయి, పక్క రాష్ట్రాల నుంచి టెక్నీషియన్లు కూడా దిగుమతి చేసుకుంటున్నారని, ముందుగా లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తే అదే గొప్ప అని, ఆ తరువాత దేశం లెవెల్ ఆలోచించవచ్చిని కామెంట్లు వినిపిస్తున్నాయి.