తెలుగులో ఆమె టాప్ హీరోయిన్. ఓ తెలుగు రాష్ట్రానికి ఆయనగారు మంత్రి. వీరిద్దరి మధ్యా గొడవ జరిగిందట. వ్యవహారం మీడియాకెక్కింది. కూతురు కాదు.. మనవరాలి వయసున్న హీరోయిన్‌తో ఆ మంత్రిగారు అసభ్యకరంగానో, ఇంకోరకంగానో.. ఎలా ప్రవర్తించారోగానీ, గొడవ జరిగిందని వార్తలొచ్చేసరికి, మంత్రిగారు కంగారుపడాల్సి వచ్చింది. అసలే ఆడకూతురితో వ్యవహారం కదా.. ఇరకాటంలో పడాల్సి వస్తుందని కాస్త జాగ్రత్తపడ్డారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, విశ్వనటుడు కమల్‌హాసన్ కుమార్తె, టాలీవుడ్లో మంచి డిమాండ్ వున్న బ్యూటీ శృతిహాసన్. మంత్రిగారేమో కామినేని శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ పనిచేస్తోన్న విషయం విదితమే. విమాన ప్రయాణంలో మంత్రిగారి వ్యవహారశైలితో శృతిహాసన్ విసుగుచెందిందట. గట్టిగా ఫోన్లో మాట్లాడేసరికి, పక్కనే వున్న శృతిహాసన్‌కి చిర్రెత్తుకొచ్చి, ప్రశ్నించేసరికి, ‘నేను మంత్రిని.. నా ఇష్టం..’ అంటూ చెడామడా ఆయన, శృతిని తిట్టేశారన్నది మీడియాలో వచ్చిన కథనాల సారాంశం.
ఈ దెబ్బతో మంత్రి కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ‘నేనెలాంటి తప్పూ చేయలేదు. అసలామెను నేనెక్కడా చూడలేదు, కలవలేదు కూడా. నేను విమాన ప్రయాణం చేసింది చాలా తక్కువ.. ఇలాంటి ఫాల్స్ న్యూస్ ఎందుకు వస్తాయోనాకు అర్థం కావడంలేదు..’ అని ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చారు కామినేని శ్రీనివాస్. ఇక, వివరణ ఇవ్వాల్సింది శృతిహాసన్ మాత్రమే. ఆమె ఇచ్చే వివరణను బట్టి, గొడవ ఇక్కడితో సమసిపోతుందా? లేదా? అన్నది తేలుతుంది.