హిందూ పురాణాలంటే ఎకసెక్కాలేనా?

సినిమాలో కొత్తగా కామెడీ రాయాలంటే కష్టం. అదే, రెడీగా వున్న రామాయణ, భారతాలను పట్టుకుని ఎకసెక్కాలు చేసేయమంటే ఈజీ. ఎంత ఈజీ అంటే కొరియన్ సినిమాలో, కన్నడ, మళయాల సినిమాలో చూసి, కాన్సెప్ట్ లు…

సినిమాలో కొత్తగా కామెడీ రాయాలంటే కష్టం. అదే, రెడీగా వున్న రామాయణ, భారతాలను పట్టుకుని ఎకసెక్కాలు చేసేయమంటే ఈజీ. ఎంత ఈజీ అంటే కొరియన్ సినిమాలో, కన్నడ, మళయాల సినిమాలో చూసి, కాన్సెప్ట్ లు కొట్టుకువచ్చినంత. ద్రౌపదీ వస్త్రాహపరణం సీన్ ను మనవాళ్లు ఎంతమంది సినిమాల్లో కామెడీ చేసారో? త్రివిక్రమ్ సైతం, అహల్య-గౌతముడు ఎపిసోడ్ తో కాస్త కామెడీ చేసారు. 

లేటెస్ట్ గా దర్శకుడు చందు మొండేటి కూడా సుభద్ర పరిణయం ఎపిసోడ్ ను కామెడీ నాటకం చేసేసారు సవ్యసాచి సినిమాలో. పౌరాణిక పాత్రల చేత చీప్ గా మాట్లాడించడం, కామెడీ చేయించడం, అందరిలాగే ఆయనా చేసేసారు.

నిజానికి వీళ్లందరికీ హిందువుల పురాణాలే దొరుకుతాయి. ఎందుకంటే వేరే వాటి జోలికిపోతే, వ్యవహారాలు తేడాగా వుంటాయి. హిందువులు తమ పురాణాల మీద, పురాణ పాత్రల మీద జోకులు వేసినా, నవ్వేసుకుని లైట్ తీసుకుంటారు కాబట్టి, నడచిపోతోంది వ్యవహారం. 

పూరి జగన్నాధ్ బ్రహ్మానందం, కోవై సరళలను విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల కింద చూపించినట్లు, చందు మొండేటి కృష్ణుడిగా వెన్నెల కిషోర్ ను చూపించేసాడు. చూసేసి, ఎప్పటి మాదిరిగా నవ్వేసుకుని, లైట్ తీస్కోవడమే. మనోభావాలు దెబ్బతినడం లాంటివి అక్కరలేదు.