ఓ అయిడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ, ఓ సినిమా ఓ స్టార్ హీరో నిర్ణయాలనే మార్చేసింది. మొత్తం ప్రస్థాన్నాన్నే యూటర్న్ తీసుకునేలా చేసింది. అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందు చాలా అనుకున్నారు. కానీ టైమ్ సరిపోలేదు. దాంతో సినిమా విడుదలయిన తరువాత మంచి టాక్ వస్తే, ఇలా చేస్తే బాగుంటదని ఓ రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ రూట్ మ్యాప్ లో ముందుగా అమెరికాలో పవర్ స్టార్ అభిమానులను కలిసే కార్యక్రమం వుంది. అజ్ఞాతవాసి సినిమాను భారీ రేటుకు అమెరికా బయ్యర్ కొన్నారు. కొనడమే కాదు, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా విడుదలవనన్ని స్క్రీన్లలో అజ్ఞాతవాసి విడుదలయ్యింది.
అందుకే అజ్ఖాతవాసికి పాజిటివ్ టాక్ వస్తే, పొంగల్ టైమ్ కు అమెరికా వెళ్లాలని పవన్ అండ్ త్రివిక్రమ్ అనుకున్నారు. అంతేకాదు, అటు నుంచి వచ్చాక, ఓరోజు బెంగళూరు వెళ్లి ఫ్యాన్స్ మీట్ పెట్టాలని, అలాగే విశాఖలో సక్సెస్ ఫంక్షన్ చేయాలనీ అనుకున్నారు.
కానీ వాటన్నింటినీ మార్చేసింది అజ్ఞాతవాసి ఫలితం. అంతేకాదు పొలిటికల్ గా ముందుకు వెళ్లాలా? వెనక్కు వెళ్లాలా? వెళ్తే ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అంటూ ఓ అనిశ్చితిలో వున్న పవన్ ను చటుక్కున నిర్ణయం తీసుకునేలా చేసింది అజ్ఞాతవాసి. ఇప్పుడు చకచకా పవన్ ముందుకు కదుల్తున్నారు రాజకీయంగా. అంతేమరి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం కదా?