ఇటీవలి కాలంలో దక్షిణాదిలో ఏ చిత్రమూ సృష్టించనంత సంచలనాన్ని మెర్సల్ సృష్టించింది. ఒక సామాజిక సమస్యను, నిర్మొహమాటమైన విమర్శలతో ఉన్నదున్నట్టుగా ఎత్తిచూపిస్తే.. సమాజం ఎంతగా కంగారు పడుతుందో.. రాజకీయ పార్టీలు ఎంతగా భుజాలు తడుముకుని.. సినిమా అనే సృజనాత్మక మాధ్యమాన్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తాయో అర్థం చేసుకోవడానికి మెర్సల్ ఒక గొప్ప ఉదాహరణ. అలాంటి మెర్సల్ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధం అవుతోంది.
విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళనిర్మాతలు తెన్నాండ్ స్టుడియోస్ వారితో కలిసి శరత్ మరార్ తెలుగులో అందిస్తున్నారు. సమంత, కాజల్, నిత్యామీనన్, ఎస్ జె సూర్య ఇలా స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రం ఇది. రెహమాన్ సంగీతం అందించడం మరో విశేషం. దీనిని నవంబరు 9న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సినిమా చుట్టూ రేగిన వివాదం.. తెలుగు సినిమాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. ఈ చిత్రం ప్రధానంగా కార్పొరేట్ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీని తెలియజెప్పే కథాంశంతో రూపొందింది. అలాగే జీఎస్టీ అంటూ ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు మళ్లీ కార్పొరేట్ దోపిడీలకు ఎలా గులాంగిరీ చేస్తున్నాయో కూడా చిత్రంలో నిశితమైన చర్చ ఉంటుంది. 11 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న సింగపూర్ లో వైద్యం అందరికీ ఉచితం కాగా, 28 శాతం వసూలు చేస్తున్న భారత్ లో కార్పొరేట్ దోపిడీ ఏంటంటూ.. హీరో ప్రశ్నించే డైలాగులు ఎంత ప్రకంపనాలు సృష్టించాయో అందరికీ తెలుసు.
ఇలాంటి పదునైన డైలాగుల మీద.. అసలు కేంద్రానికి సంబంధించి, జీఎస్టీని చూసే వారికి సంబంధించి ఎవ్వరూ స్పందించలేదు గానీ.. తమిళనాడులో సోదిలో లేని భాజపా నాయకులకు మాత్రం కోపం పొడుచుకు వచ్చింది. కాస్త రభస చేసి తర్వాత ఊరుకున్నారు. వీరి రచ్చకు, సెన్సార్ పూర్తయిన సినిమా మీద ఈ రాజకీయ రాద్దాంతం ఏంటంటూ.. పలువురు అండగా నిలవడంతో సద్దుమణిగింది.
మరి ఇప్పుడు తెలుగులో ఆ సంచలన డైలాగులు అన్నీ ఉంటాయ లేక, ఇక్కడి వారి రాజకీయ ఒత్తిళ్లకు ముందే తొలగించారా అనే సంగతి తెలియడం లేదు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ విషయానికి వస్తే.. హైదరాబాదు, విజయవాడ నగరాలు కూడా దేశంలోనే పేరుమోసిన స్థానంలోనే ఉన్నాయి.. ఇరు తెలుగు ప్రభుత్వాలూ.. తమ రాజధానులను మెడికల్ హబ్ లుగా చేసేస్తాం అనే మాయ ప్రకటనలతో కార్పొరేట్ ఉచ్చులోకి ప్రజల ప్రాణాల్ని ఉసిగొల్పుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలనే అరాచక శక్తులు రాజకీయ నాయకుల్ని ప్రభావితం చేసే సందర్భాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. మరి.. ఆ సినిమాను తమిళంలో ఉన్నంత అంతే పదునుగా తెలుగులో విడుదల కావడానికి వీరు సహిస్తారా? లేదా, విడుదలకు ముందే.. ఆయా వివాదాస్పద డైలాగులపై కత్తిరింపులు వేసేశారా? అనేది ఇంకా స్పష్టత లేదు. సంచలనంతోనే సినిమా ప్రజలను రంజింపజేయాలంటే కొత్త కత్తిరింపులు లేకుండానే సినిమా విడుదల కావాలని పలువురు అంటున్నారు.