ఇంకో వర్మని అనుకుంటే అంతే సంగతులు

విజయ్‌ దేవరకొండ… గట్టిగా మాట్లాడుకుంటే 'పెళ్లిచూపులు' మినహా మరో ఐడెంటిటీ లేదీ కుర్రాడికి. ఆ చిత్రంలో తన భవిష్యత్తు గురించి సరైన అవగాహన లేని మిడిల్‌క్లాస్‌ కుర్రాడిగా యూత్‌ని మెప్పించిన విజయ్‌ 'అర్జున్‌ రెడ్డి'…

విజయ్‌ దేవరకొండ… గట్టిగా మాట్లాడుకుంటే 'పెళ్లిచూపులు' మినహా మరో ఐడెంటిటీ లేదీ కుర్రాడికి. ఆ చిత్రంలో తన భవిష్యత్తు గురించి సరైన అవగాహన లేని మిడిల్‌క్లాస్‌ కుర్రాడిగా యూత్‌ని మెప్పించిన విజయ్‌ 'అర్జున్‌ రెడ్డి' టీజర్‌లో పలికిన ఒక బూతు మాటతో ఒక్కసారిగా షాకిచ్చాడు. తెలుగు సినిమా టీజర్లలో అంత పచ్చి బూతుని అంత క్లారిటీతో వినడం అదే తొలిసారి.

ఇదేదో సంచలనాత్మక సినిమాలా వుందంటూ యూత్‌ దీనికోసం తెగ ఎదురు చూస్తున్నారు. అందుకే అర్జున్‌రెడ్డికి ఆ రేంజ్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. మరి ఈ ఉత్సాహంలో ఒళ్లు మరచిపోయాడో లేక తన తీరే అంతో తెలియదు కానీ 'అర్జున్‌రెడ్డి' వేడుకలో విజయ్‌ గీత దాటి మాట్లాడాడు.

ఒక నటుడు పబ్లిక్‌ వేడుకలో ఇలాంటి మాటలు మాట్లాడడమనేది చరిత్రలో లేదు. ఇంటర్వ్యూల్లో కొందరు తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా వ్యక్తం చేస్తుంటారు కానీ ఇలా వేదికలెక్కి బూతులు మాట్లాడింది లేదు.

ఇదిలావుంటే ఈ కుర్రాడిని వెనకేసుకుని వస్తూ 'నువ్వు నాలానే వున్నావంటూ' రామ్‌ గోపాల్‌ వర్మ అన్నాడు. దీనిని కానీ సీరియస్‌గా తీసుకుని విజయ్‌ ఇదే తీరు కొనసాగిస్తే అంతే సంగతులు. ఒక క్రియేటర్‌ ఎన్ని మాట్లాడినా చెల్లిపోతుంది. ఎందుకంటే అతనెప్పుడూ తెర వెనకే వుంటాడు.

నటులు పబ్లిక్‌ బిహేవియర్‌ విషయంలో జాగ్రత్తగా వుండాలి. తమ మాట తీరు, తమ ప్రవర్తన తాము చేసే సినిమాలపై ప్రభావం చూపిస్తాయి. పొగరుబోతుగా ముద్ర వేయించుకుని పరిశ్రమలో నెగ్గుకొచ్చిన వారు ఎంతమంది వున్నారనేది ఒక్కసారి తరచి చూసుకుంటే విజయ్‌కే మేటర్‌ అర్థమైపోతుంది.