సినిమా హీరోను బట్టి కథ అల్లుకోవడమే కాదు బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఘాజీ సినిమా అందించిన సంకల్ప్ రెడ్డి మలి సినిమా కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికైనా కొలిక్కి వస్తాయేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతగాడు తన మలి సినిమా కోసం వరుణ్ తేజ్ ను హీరోగా తీసుకున్నాడు.
అయితే సినిమాకు దర్శకుడు తయారుచేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం బడ్జెట్ 23కోట్లు వరకు అవుతుందని అంచనా. ఫిదా మినహాయిస్తే వరుణ్ తేజకు అంత మార్కెట్ లేదు. అందుకే స్క్రిప్ట్ ఒకె కానీ హీరో మీద అంత బడ్జెట్ నా అని నిర్మాతలు ముందుకు వెనక్కు అవుతున్నారు.
ఇలాంటి టైమ్ లో వరుణ్ తేజ్ కు ఇప్పుడు మరో హిట్ వచ్చింది. 18కోట్లు థియేటర్ రైట్స్, మరో అయిదారు కోట్ల డిజిటల్ శాటిలైట్ హక్కులతో కలిపి 24కోట్లు రేంజ్ లో విడుదలయింది తొలి ప్రేమ సినిమా. మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా కనుక ప్రాఫిట్ జోన్ లోకి వస్తే, వరుణ్ తేజ్ మీద భరోసా పెరుగుతుంది.
అప్పుడు కచ్చితంగా సంకల్ప్ రెడ్డి సినిమాకు నిర్మాతలు రెడీ అయిపోతారు. అంతే కాదు, మాకు, మాకు అంటూ పోటీ పడినా ఆశ్చర్యం లేదు. కానీ ఎటొచ్చీ అంత సీన్ రావాలి అంటే వన్ వీక్ వెయిట్ చేయాలి. తొలిప్రేమ ఫస్ట్ వీక్ కలెక్షన్లను బట్టి వరుణ్ తేజ్ స్టామినా అర్థం అవుతుంది. ఎందుకంటే ఫిదా కలెక్షన్లలో సాయిపల్లవి షేర్ ఎక్కువ కదా? ఇప్పుడు వరుణ్ సోలో స్టామినా తెలుస్తుంది.