ఇదీ ఒక జయమేనా సింహా?

బాలకృష్ణ సినిమాలకి అయితే అటు, లేదంటే ఇటు అనే పేరుంది. పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయి రికార్డులు తిరగరాయడమో లేదా డిజాస్టర్‌ అయి కనుమరుగు అవడమో ఆయన సినిమాల లక్షణం. మాస్‌ మసాలా సినిమాలకి పెట్టింది…

బాలకృష్ణ సినిమాలకి అయితే అటు, లేదంటే ఇటు అనే పేరుంది. పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయి రికార్డులు తిరగరాయడమో లేదా డిజాస్టర్‌ అయి కనుమరుగు అవడమో ఆయన సినిమాల లక్షణం. మాస్‌ మసాలా సినిమాలకి పెట్టింది పేరయిన బాలకృష్ణకి లాయల్‌ ఫాన్స్‌ వున్నారు. సినిమా నచ్చితే బ్రహ్మరథం పడతారు, నచ్చనపుడు నిర్మొహమాటంగా తిప్పికొట్టేస్తారు.

ఇక సంక్రాంతికి బాలయ్య బ్లాక్‌బస్టర్ల జాబితా అయితే చాలానే వుంది. ఈ నేపథ్యంలో అంతంత మాత్రంగా ఆడిన బాలయ్య తాజా చిత్రం 'జై సింహా'ని బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా వుంది. అజ్ఞాతవాసి కంటే కాస్త మెరుగ్గా వుండి, ఒక తల, ఒక తోక వున్న కారణంగా 'జైసింహా' సంక్రాంతి వరకు నెట్టుకొచ్చిందనేది తెలిసిందే.

అదే అజ్ఞాతవాసి అంచనాలని అందుకుని వుంటే ఈ జై సింహా ఏమైపోయి వుండేదోనని ట్రేడ్‌ వర్గాలే చెబుతున్నాయి. అలా అని ఈ చిత్రం ఏమైనా అన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయిందా అంటే అదీ లేదు. బాలయ్య రీసెంట్‌ సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ ధరలకి అమ్మినప్పటికీ ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో నష్టపోయింది. మరికొన్ని చోట్ల చావు తప్పి కన్నులొట్టపోయింది. సీడెడ్‌, ఉత్తరాంధ్ర మినహాయిస్తే బాగా ఆడిందని చెప్పుకునే ఏరియా లేదు.

అయినప్పటికీ ఈ చిత్రం ఆహా, ఓహో అంటూ ఊదరగొట్టేస్తున్నారు. హిట్టే లేని సి.కళ్యాణ్‌కి ఇది భారీ బ్లాక్‌బస్టర్‌లా అనిపించడంలో తప్పు లేదు కానీ దీనిని ఇంత ఘనంగా చాటుకుంటే ఎన్నో బ్లాక్‌బస్టర్లున్న బాలకృష్ణని అవమానించినట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.