హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్న టైమ్ లో జగపతిబాబుకి విలన్ గా అవకాశమిచ్చి ప్రోత్సహించిన హీరో బాలకృష్ణ. లెజండ్ సినిమా తర్వాత ఇక జగపతి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత హీరోగా బాలయ్యకు, విలన్ గా జగపతికి ఇద్దరిటీ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది లెజండ్.
విలన్ గా జగపతిని బాలయ్య తొలి అడుగు వేయిస్తే.. నందమూరి వారసులు జగపతి బాబుతో మరో మూడు సినిమాలు చేశారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్-జగపతి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచినా.. అరవింద సమేత వీరరాఘవలో మాత్రం బసిరెడ్డి వర్సెస్ రాఘవరెడ్డి ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. కలెక్షన్ల విషయంలో నాన్నకు ప్రేమతో కాస్త నిరాశ పరిచినా అరవింద సమేత.. బాక్సాఫీస్ కొల్లగొడుతూ ఎన్టీఆర్ కి ఆ లోటు తీర్చింది.
తొలి సినిమాతోనే బాలకృష్ణ బాకీ తీర్చుకున్న జగపతిబాబు, ఎన్టీఆర్ కి రెండో సినిమాతో లెక్క సరిచేశాడు. ఇక నందమూరి ఫ్యామిలీలో మిగిలిన మరో హీరో కల్యాణ్ రామ్ కి మాత్రం బాకీ ఉండిపోయాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమాలో కల్యాణ్ రామ్, జగపతిబాబు కలిసి నటించారు. ఆ సినిమా ఓ చేదు జ్ఞాపకం.
ఈసారి మంచి కాంబినేషన్ సెట్ అయితే కల్యాణ్ రామ్ కి కూడా ఓ మెమరబుల్ హిట్ ఇచ్చి బాకీ తీర్చేయాలనుకుంటున్నాడు జగపతి బాబు. నందమూరి ఫ్యామిలీకి అచ్చొచ్చిన ప్రతినాయకుడిగా నిలిచిపోవాలని చూస్తున్నాడు.