పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కార్తీకమాసం నెలరోజులు జలాహారం మాత్రమే తీసుకుంటారని వార్తలు వచ్చేసాయి. తనకు కులం లేదు, మతం లేదు, మా ఆవిడ క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అని పదే పదే ఎన్నికల ముందుచెప్పి, జగన్ వైపు వున్న క్రిస్టియన్ ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేసిన పవన్ కు ఇప్పుడు వున్నట్లుండి కార్తీకమాసం, కార్తీక పూజలు, జలాహారం వంటివి ఎందుకు గుర్తుకు వచ్చాయా? అన్నది అనుమానంగా వుంది. ఇప్పటి వరకు ఎన్నో కార్తీకమాసాలు వచ్చాయి కానీ పవన్ ఇలా చేయలేదు. ఇప్పుడు ఎందుకు అన్నది క్వశ్చను?
ఈ మధ్య హిందువుల మనసులు గెలుచుకోవడంలో అందరికన్నా జగన్ ముందున్నారు. జీర్ణదేవాలయాల పునరుద్దరణ, పూజారులకు వరాలు, ఇలా అన్నివిధాలా జగన్ తన మీద వున్న క్రిస్టియన్ ముద్ర చెరుపేసుకుంటున్నారు. మరోపక్క దేశం మొత్తంమీద గతంలో కన్నా హిందూత్వ భావజాలం పెరుగుతోంది. పవన్ కూడా ఈ నేపథ్యంలోనే ఈ కార్తీకమాస హడావుడి స్టార్ట్ చేసి వుండాలి అన్నది రాజకీయ పరిశీలకుల అనుమానం.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మరో రెండు మూడునెలల్లో పవన్ సినిమాల్లోకి తిరిగి ప్రవేశించబోతున్నారు. చాలాకాలంగా పవన్ రాజకీయాల్లో వుండి, శరీరాకృతిని పెద్దగా పట్టించుకోలేదు. అలా అని ఆయన శరీరపు కొలతలు పెద్దగా ఏమీ మారిపోలేదు కానీ, హీరో లెవెల్ కు కొద్దిగా దూరంగా వున్నాయి. అందువల్ల ఓ నెలరోజులు పనిలో పనిగా జలాహారం తీసుకుని, ఫిట్ నెస్ను, శరీరాకృతిని మెరుగుచేసుకునే పనిలో పడ్డారా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తంమీద పవన్ జలాహార దీక్ష అన్నది బహుళార్థక సాధక ప్రాజెక్టులా కనిపిస్తోంది.