ఎప్పుడు? ఎప్పుడా అని చూస్తున్నారు రాజమౌళి అభిమానులు ఆయన తరువాతి సినిమాపై నిర్ణయం కోసం. కానీ ఇప్పటి వరకు గాలి వార్తలే తప్ప, గట్టి వార్తలు వినరావడం లేదు. నిర్మాత రెడీగా వున్నారు. డివివి దానయ్యేకే రాజమౌళి సినిమా చేస్తారు. అది మాత్రం పక్కా అని తెలుస్తోంది. హీరో ఎవరు అన్నది సమస్య కాదు. ఎందుకంటే రాజమౌళి అడిగితే, ఏ హీరో కాదు అని అంటారు?
దానయ్య కు రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. బన్నీతో కూడా దానయ్యకు మంచి సంబంధాలు వున్నాయి. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తానని దానయ్య ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈ ముగ్గురే రాజమౌళి చాయిస్ గా వుంటారా? లేక, మరెవరైనా వస్తారా? లేక మల్టీస్టారరా? అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే, నిర్మాత దానయ్యకు కూడా త్వరలో చెబుతాను, అనే చెప్పినట్లు తెలుస్తోంది.
జనవరి నుంచి సీరియస్ గా తరువాతి ప్రాజెక్టు మీద రాజమౌళి ఫ్యామిలీ వర్క్ చేస్తుందని తెలుస్తోంది. ఈ మూడు నెలలు అలా అలా గడిపేసి, ఇక జనవరి నుంచి సినిమా వ్యవహారాల మీదే వుంటారని వినికిడి. ఇప్పడు ఏ సినిమా చేసినా, ఎవరితో చేసినా, కనీసం రెండు వందల కోట్ల రేంజ్ లో వుండాలి. ప్యాడింగ్ అండ్ లీడ్ ఆర్టిస్టుల్లో కొందరయినా, ఇతర భాషల నుంచి వుంటారు. అది ఎలాగూ వుంటుంది.
కానీ, హీరో, లేదా హీరోలు ఎవరు అన్నదే తేలాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకే ఎక్కువ అవకాశం వుందని, వారిలో ఒకరు కాని, ఇద్దరూ కానీ వుండే అవకాశం వుందని తెలుస్తోంది. మహేష్ బాబుతో చేయాలని వున్నా, ప్రస్తుతం వున్న పరిస్థితుల దృష్ట్యా, ఇప్పట్లో కాకుండా, తరువాతి సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది.