జయ పాత్రలో ఆ సీనియర్ హీరోయిన్, తమిళంలో సినిమా!

ఒకవైపు ‘శశికళ’ ను ప్రధాన పాత్రలో పెట్టి.. జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాను తీస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. సహజంగా తన సినిమాల ద్వారా వివాదాలను రేకెత్తించడానికి ఇష్టపడే వర్మ…

ఒకవైపు ‘శశికళ’ ను ప్రధాన పాత్రలో పెట్టి.. జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాను తీస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. సహజంగా తన సినిమాల ద్వారా వివాదాలను రేకెత్తించడానికి ఇష్టపడే వర్మ జయ జీవిత కథను శశికళ వైపు నుంచి ఆవిష్కరిస్తానని చెప్పడం ద్వారా ‘శశికళ’ పేరుతో సినిమాను తీస్తానని ప్రకటించడం ద్వారా.. తన స్టైల్ ఏమిటో మరో సారి చాటుకున్నాడు.'

ఇక వర్మ సంగతిలా ఉంటే.. జయలలిత పాత్రను చేయడానికి సై అంటోంది సీనియర్ నటీమణి రమ్యకృష్ణ. నటిగా దక్షిణాదిన మంచి గుర్తింపు, ప్రత్యేకత కలిగిన రమ్య.. ఈ అంశంపై స్పందించింది. ఎవరు జయలలిత జీవిత కథను సినిమా తెరకెక్కించినా అందులో తను జయ పాత్రను చేయడానికి సిద్ధమని ఆమె ప్రకటించింది. ‘ఇన్నాళ్లూ.. మీ డ్రీమ్ రోల్ ఏమిటి?’ అంటూ చాలా మంది జర్నలిస్టులు అడిగే వారు. దానికి నేను ఏ సమాధానం చెప్పేదాన్ని కాదు, ఇప్పుడు చెబుతున్నా.. జయలలిత మేడమ్ పాత్రను చేయడమే నా డ్రీమ్ రోల్..’’ అని ప్రకటించింది రమ్యకృష్ణ.

తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తుందని, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో జయలలిత జీవిత గాథ సినిమాగా తెరకెక్కుతుందనే మాట వినిపిస్తోంది. మరి ఇది ఏ మేరకు పట్టాలెక్కుతుందో చూడాలి.

అలాగే.. ఇప్పటికే జయలలిత జీవితగాథపై తన ఇష్టాన్ని ప్రదర్శించిన త్రిషను కూడా ఇప్పుడు గుర్తుకు చేసుకోవాలి. జయలలిత ఆసుపత్రి పాలైన దశలోనే.. జయ బయోపిక్ తీస్తే అందులో తను నటిస్తానని త్రిష చెప్పింది. జయకు త్రిష పెద్ద ఫ్యాన్ కూడా.

ఇంకా.. కన్నడలో ఇప్పటికే జయలలిత జీవిత కథ ఆధారంగా ఒక సినిమా  రెడీ అవుతోందనే మాట వినిపిస్తోంది. జయ మరణం నేపథ్యంలో ఆ సినిమాను రీషూట్ చేస్తున్నారట!

ఏతావాతా.. ఈ చర్చలో ఉన్న సినిమాలన్నీ పట్టాలెక్కితే.. కనీసం అరడజను సినిమలు జయ జీవిత కథ ఆధారంగా రూపొందినవి అవుతాయేమో!