జూన్ నెల.. బాహుబలి-2కు సిసలైన పరీక్ష

ఇప్పటివరకు బాహుబలి-2 సినిమాకు అంతా నల్లేరు మీద నడకలా సాగింది. ఎక్కడ విడుదలైతే అక్కడ కలెక్షన్ల వర్షం కురిసింది. అలా 1500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది బాహుబలి ది కంక్లూజన్ మూవీ.…

ఇప్పటివరకు బాహుబలి-2 సినిమాకు అంతా నల్లేరు మీద నడకలా సాగింది. ఎక్కడ విడుదలైతే అక్కడ కలెక్షన్ల వర్షం కురిసింది. అలా 1500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది బాహుబలి ది కంక్లూజన్ మూవీ. కానీ ఈ సినిమాకు సిసలైన అగ్నిపరీక్ష వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. 

బాహుబలికి కొరకరాని కొయ్యలా మారిన చైనా మార్కెట్లో వచ్చే నెలలో పార్ట్-2 విడుదలకానుంది. మొదటి భాగాన్ని పంపిణీ చేసిన ఈ-స్టార్ సంస్థే “కంక్లూజన్”ను కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకొచ్చింది. పార్ట్-1 దాదాపు 4వేల స్క్రీన్స్ పై విడుదలైంది. పార్ట్-2ను 5వేలకు మించి తెరలపై రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ చైనాలో విడుదలైన బాహుబలి-1 అట్టర్ ఫ్లాప్ అయింది. పెట్టిన ఖర్చు కూడా వెనక్కిరాలేదు. ఇలాంటి టైమ్ లో పార్ట్-2 చూస్తారా అనే సందేహం మేకర్స్ లో ఉంది. అటు చూస్తే మరో ఇండియన్ మూవీ దంగల్ చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఒక్క చైనాలోనే ఆ సినిమా వసూళ్లు 726కోట్లు దాటేశాయి. ఇలాంటి టైమ్ లో రిలీజ్ అవుతున్న బాహుబలి-2 కనీసం యావరేజ్ గా అయినా ఆడాలి.

చైనా రిలీజ్ తో పాటు వచ్చేనెల బాహుబలి-2కు మరో సవాల్ కూడా సిద్ధంగా ఉంది. అదే ఐరోపా మార్కెట్. బాహుబలి-1 చైనాతో పాటు కొన్ని యూరోప్ దేశాల్లో కూడా ఆడలేదు. వచ్చే నెలలో ఆ దేశాల్లో కూడా సినిమా విడుదలకానుంది. సో.. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా ఏదనే విషయం వచ్చేనెలలో తేలిపోతుంది. చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో బాహుబలి-2 హిట్ అయితే ఆ సినిమా వసూళ్లు 2000కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. లేదంటే దంగల్ సినిమా బాహుబలి-2ను క్రాస్ చేయడం ఖాయం. 

దంగల్ మూవీ ఇప్పటికే బాహుబలి-2కి పోటీగా మారింది. చైనా వసూళ్లతో కలుపుకొని ఇప్పటివరకు 1470 కోట్ల రూపాయలు (21వ తేదీ నాటికి) కలెక్ట్ చేసింది. మరోవైపు ఒక్క చైనాలోనే ఈ సినిమా వెయ్యికోట్లు వసూలు చేస్తుందనే అంచనా ఉంది. సో.. జూన్ నెల బాహుబలి-2కు నిజంగా అగ్నిపరీక్ష.