జ్యో అచ్యుతానంద సినిమా పాజిటివ్ రివ్యూలతో ఫరావాలేదు అనే దిశగా నడుస్తోంది. నిజానికి ఈ సినిమాకు మరింత బాగా పబ్లిసిటీ చేసి వుంటే ఇంకా బాగుండేది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు, తరువాత కూడా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నే ప్రచార భారాన్ని ఎక్కువగా మోసారు, మోస్తున్నారు. కొన్ని చానెళ్లకు ఆయనకు తోడుగా సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ కూడా వెళ్లారు.
అమెరికాలో ఇది తన హిట్ సినిమా అని నారా రోహిత్ చెప్పుకునే ప్రయత్నం చేసారు.కొన్ని థియేటర్లను విజిట్ చేసారు. సో. కొంతవరకు అక్కడ ఫరవాలేదు. సినిమా విడుదలయిన కొన్నాళ్లు హీరోయిన్ రెజీనా రంగంలోకి వచ్చింది. కాస్త ప్రచారం నిర్వహించింది.
కానీ సినిమా విడుదలకు ముందు కోద్ది సేపు మాత్రం కనిపించిన హీరో నాగశౌర్య, సినిమా విడుదలయ్యాక మరి కనిపించలేదు. మీడియమ్ రేంజ్ లో వెళ్తున్న సినిమాను యూనిట్ అంతా కలిసి, కాస్త ప్రమోట్ చేసుకుంటే మరింత బాగుంటుంది. కానీ నాగశౌర్య ఎందుకు మాయమయినట్లో? ప్రస్తుతం షూటింగ్ లు కూడా లేవు.
గతంలో ఊహలు గుసగుసలాడే సినిమా విడుదలయ్యాక కూడా నాగశౌర్య తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రచారానికి గాయబ్ అయ్యాడు. అప్పట్లో నిర్మాత సాయి కొర్రపాటికి ఈ విషయమై కాస్త ఆగ్రహం కలిగి చాన్నాళ్లు దూరం పెట్టారు కూడా. మరి ఇప్పుడు కూడా నాగశౌర్య విడుదల తరువాత కొద్ది రోజులు అనారోగ్యం అని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై యూనిట్ వర్గాలను ప్రశ్నిస్తే, గడచిన రెండు రోజుల్లో నాగశౌర్య, నారా రోహిత్ ప్రచారంలోకి దిగారని సమాధానం వచ్చింది. అంటే సినిమా విడుదలైన వారం తరువాత రంగంలోకి దిగారన్నమాట. అన్నట్లు తాజా ఖబర్ ఏమిటంటే, ప్రచారం సంగతి ఎలా వున్నా, నాగశౌర్య యూనిట్ కు సోమవారం రాత్రి మంచి పార్టీ మాత్రం ఇచ్చారట. పార్టీలకన్నా ప్రచారం ముఖ్యం అని ఎప్పుడు గ్రహిస్తారో మరి?