కమల్‌ హాసన్‌ను కాపీ కొట్టడంలో టాలీవుడ్‌ హీరోలు బిజీ!

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్‌చరణ్‌ తేజ్‌ చెవిటివాడి పాత్రలో చేస్తున్నాడు… ఇదెంత గొప్ప అయిపోయిందంటే, రామ్‌చరణ్‌ ఏదో అవార్డెడ్‌ సినిమాలో నటిస్తున్నాడు అన్నంత గొప్ప అనిపిస్తోంది మనోళ్లకు. అసలు రామ్‌చరణ్‌ చేస్తున్న ప్రయోగం…

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్‌చరణ్‌ తేజ్‌ చెవిటివాడి పాత్రలో చేస్తున్నాడు… ఇదెంత గొప్ప అయిపోయిందంటే, రామ్‌చరణ్‌ ఏదో అవార్డెడ్‌ సినిమాలో నటిస్తున్నాడు అన్నంత గొప్ప అనిపిస్తోంది మనోళ్లకు. అసలు రామ్‌చరణ్‌ చేస్తున్న ప్రయోగం అలాంటిలాంటిది కాదు, నభూతో, నభవిష్యతి అని చాలాగొప్పగా చెబుతోంది తెలుగు మీడియా.

ఎంతో మాస్‌ ఇమేజ్‌ను కలిగి ఉన్న రామ్‌చరణ్‌ చాలా బోల్డ్‌ స్టెప్‌ అని, అసలు ఇమేజ్‌ ఉన్న హీరోలు ఎవ్వరూ అలాంటి పనిచేయరు.. అని మీడియా రామ్‌చరణ్‌ తరపున ఢంకా భజాయిస్తోంది. మరి ఇలా చెప్పబట్టే తెలుగు మీడియా తెలుగు హీరోలను అలా తయారు చేసింది.

ఇక మరోవైపు భయం.. ఈ చెవిటిపాత్ర ఏమిటో.. సుకుమార్‌ రామ్‌చరణ్‌ను ఎలా చూపుతాడో, ఆ చూపే చూపడం తేడాకొట్టి సినిమా ఎక్కడ పోతుందో.. అనేది అభిమానగణాన్ని వేధిస్తున్న భయం. ఎందుకొచ్చిందిరా బాబూ.. ఏదో మాస్‌ ఎంటర్‌ టైనర్లనో, బ్రహ్మానందం చెంపలు పగలగొట్టే పాత్రనే చేస్తూ పోయుంటే ఇంకో హిట్టు దక్కేది.. అలాంటి సేఫ్‌గేమ్‌ ఆడాల్సింది అని అభిమానులు తెగ ఇదైపోతున్నారు. తమ హీరోని సుకుమార్‌ ఏం చేస్తాడో అనేది వీరి భయం.

ఇలాంటి స్థితిలో కొట్టుమిట్టాడుతోంది తెలుగు సినిమా. ఇది కేవలం ఏ రామ్‌చరణ్‌ తేజ్‌ పరిస్థితో కాదు.. టాలీవుడ్‌ హీరోల స్థితి అంతా ఇదే. ప్రయోగానికి, పరమరొటీన్‌కి మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇదెంత విషాదం అంటే.. ఇప్పటికీ మన సినిమా ఇంత దారుణమైన స్థితిలో ఉండటం.. షేమ్‌.

ఒక తెలుగు హీరో చెవిటివాడి పాత్రను చేస్తే అదో వండర్‌, ఇంకో హీరో బ్రాహ్మణుడి గెటప్పులో ఓవరాక్షన్‌ చేస్తే.. అది ఈ డికేడ్‌కే గొప్ప. ఇంకో హీరో సరదాగా కాసేపు గుడ్డివాడిగా కనిపిస్తే అతడు ప్రయోగాల విషయంలో మార్గదర్శి!

ఈ శతాబ్దంలోని ఈ దశాబ్దంలో కూడా తెలుగు సినిమా స్థితి ఇలాగే ఉంది. మరి మన మీడియాకు కళ్లు మూసుకుపోయి వీళ్లు వేస్తున్న గుడ్డివాళ్ల పాత్రలు, చెవిటి వాళ్ల పాత్రలను అపురూపంగా చూపుతోంది కానీ.. మన పక్క భాషలోనే అలాంటి పాత్రలను కమల్‌హాసన్‌ ఏనాడో నమిలిమింగేశాడనే విషయాన్ని గుర్తు చేయదే.

ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట కమల్‌ చేసిన ప్రయోగాలను, పండించిన పాత్రలనే ఇప్పుడు మనోళ్లు సాహసోపేతం చేస్తున్నారని చెప్పదే. సినిమా వాళ్లను క్రిటిసైజ్‌ చేసే దమ్ములేని ప్రధాన మీడియా వర్గాలు మన హీరోలు తుమ్మినా కొత్తగా తుమ్మారనే విషయాన్ని చెప్పడానికే పరిమితం అయిపోయింది. దాన్ని నిందించడం వేస్ట్‌.

డీజేలో అల్లుఅర్జున్‌ బ్రహ్మణుడిగా కనిపిస్తే అదో విచిత్రం, అదో వండర్‌ అన్నట్టుగా కలరింగ్‌ ఇచ్చారు. మరి రెండు షేడ్స్‌ ఉన్న పాత్రను చేసిన అల్లుఅర్జున్‌ బ్రహ్మణ గెటప్‌ను ఏదో అరువు తెచ్చుకున్నట్టుగా కాసేపుచేసి చూపించాడే కానీ.. ఇంకా సంభాషణలో 'అతి', ఓవర్‌గా ఇమిటేట్‌ చేయడమే తప్ప ఇంకేముంది కొత్తగా? ఇక చరణ్‌ చెవిటివాడిగా కనిపించబోతున్నాడట.. దీన్నో ప్రపంచ వింతగా చెబుతున్నారు.

మరి ఆ పాత్రను చరణ్‌ ఎలా పండిస్తాడో ఇప్పుడే చెప్పలేం కానీ.. దాదాపు దశాబ్దంన్నర కిందటే కమల్‌హాసన్‌ 'ముంబై ఎక్స్‌ప్రెస్‌'లో చెవిటివాడి పాత్రను ఒక రేంజ్‌లో పండించాడని గుర్తు చేయాలిక్కడ. ఆ సినిమా హిట్టైందా, పోయిందా.. అనే సంగతిని కాసేపు పక్కనపెడితే, చెవిడివాడిగా కమల్‌ ఆహార్యం ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఉంటుంది. అమాయకత్వం దానికితోడు చెవిటి.. మరి కమల్‌ అలాంటి విన్యాసాన్ని చేసేశాడు. కానీ పదిహేనేళ్ల తర్వాత చరణ్‌ చెవిటివాడిగా చేయడం మనకు పెద్దగొప్ప! 

ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇక హీరో బ్రహ్మణ పాత్రలో కనిపించడం అంటే.. మనోళ్లు చేస్తున్న ఓవరాక్షన్‌ హద్దు లేకుండాపోతోంది. పిలక పెట్టాలి, గోచి పంచే కొట్టుకోవాలి.. దద్యోజనం, దప్పళం.. లాంటి మాటలే మాట్లాడాలి, అంట్ల వెధవ అనే తిట్టాలి.. మనోళ్లు అలా ఫిక్సయిపోయారంతే.

మరి మూడుదశాబ్దాల వెనకటి సినిమా 'మైఖేల్‌ మదన కామరాజన్‌'లో కమల్‌ ఒక బ్రహ్మణయువకుడి పాత్రను ఎంత అవలీలగా పోషించాడో గుర్తు చేయకతప్పదు. ఆ సినిమాలో కమల్‌ ఒక వంటవాడి పాత్రలోనే కనిపిస్తాడు. ఊరికే బొట్లు పెట్టి, నామాలు లాగి, పిలకపెట్టి అతి చేయలేదు.. కానీ, బ్రహ్మణ యువకుడు అంటే అలాగే ఉంటాడు.. అనే అభిప్రాయాన్ని బలంగా వేయగలిగాడు కమల్‌. 

ఎక్కడా అతి ఉండదు.. కామెడీ కోసం బ్రహ్మణ పాత్రను వేసి, దాంతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించడంలో కమల్‌ తర్వాత మరెవరూ సాటిరాలేదు. అపరిచితుడులో విక్రమ్‌ ఆ వేషం వేసినా.. ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించినా.. కమల్‌ స్థాయిలేదు. ఇక అదుర్స్‌లో ఎన్టీఆర్‌ ఆహార్యం కన్నా.. ఆ సినిమాలో సంభాషణలు, సీన్లు ఎక్కువగా నవ్వించాయి. ఈ సినిమాలో నవ్వించడంలో ఎన్టీఆర్‌ను బ్రహ్మానందం డ్యామినేట్‌ చేశాడు. ఎన్టీఆర్‌కు కొన్నే మార్కులు పడతాయి.

ఇక జెంటిల్మన్‌లో అర్జున్‌ చేసింది దాదాపు బ్రహ్మణ యువకుడి పాత్రే అయినప్పటికీ.. ఆ తత్వాన్ని కొద్దిగానే చూపారు. ఇక అల్లరినరేష్‌ కూడా చేశాడు కానీ.. అది వేరే స్టీమ్‌. ఇక అల్లుఅర్జున్‌ సరేసరి. నామాలు పెట్టి, పంచెకడితే మాత్రమే బ్రహ్మణయువకుడిలా మాటలొస్తాయి.. అవివిప్పి వేరే డ్రస్‌ వేస్తే మారిపోతాయి.. ఇక దాని గురించి ఇంకేం చర్చించగలం?

ఇక అంధుడి వేషం.. తెలుగు హీరోలు టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఇస్తున్న మరో గిఫ్ట్‌. వీటిల్లో సీరియస్‌ ఉండదు.. ఇదో పైత్యం మాత్రమే. మరి ఇలాంటి పాత్రను కమల్‌ పండించిన తీరుతో తెలుగు హీరోలను పోల్చడం వ్యర్థ ప్రయాసే. కానీ 'అమావాస్య చంద్రుడు' వంటిసినిమాను గుర్తుచేసి.. కమల్‌ను ప్రస్తావించాలి.ఆ సినిమా డిజాస్టరే.. దాంతో వచ్చిన నష్టాల నుంచి బయటపడటానికి కమల్‌కు ఏడెనిమిదేళ్లు పట్టిందట.

ఆ సినిమాకు కమల్‌ హాసనే నిర్మాత. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్‌గా కమల్‌ డెడికేషన్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి అయినా ఆ సినిమాను ప్రస్తావించాలి. ఇంకా ఎవరో మరో తెలుగు హీరో అంధుడి పాత్రను చేయబోతున్నాడట.. అలాంటి విషయాలను పట్టుకునే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో ఎదిగిపోతోందని మీడియా కీర్తిస్తుంటే నవ్వురాకమానదు.

సరే.. ఓవరాల్‌గా టాలీవుడ్‌ ప్రయోగాల ధీరులు చెవిటి, అంధుడు, బ్రహ్మణయువకుడు అనే పాత్రాల ద్వారా కమల్‌హాసన్‌ లాంటి నటుడు నమిలి వదిలేసిన పాత్రలను, కమల్‌ స్థాయిలో పోల్చడానికి ఏ మాత్రం పనికిరాని స్థాయిలో చేస్తున్నారు. బాగానే ఉంది. మరి ఇంతోటితోనే తెలుగు సినిమా ఎక్కడికో ఎదిగిపోతోంతని భుజాలు ఎగరేసుకొంటున్నారు కొంతమంది. మరి అప్పుడే అయిపోలేదు.. ప్రయోగాలంటూ ఏవో చేస్తున్నారు.

వాటికి తమ పైత్యాన్ని, అతిని జోడించి కంగాళీగా మారుస్తున్నారు. కానీ కమల్‌ చేసి వదిలిన ప్రయోగాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. రేపు వాటిని కూడా ఒక్కొక్కరు అనుకరిస్తూ పోతారేమో. పోతురాజు, అభయ్‌, బ్రహ్మచారి…. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో వైవిధ్యమైన పాత్రలో పూర్తి భిన్నమైన రూపంతో కమల్‌ జీవించేశాడు.. అనుకరించాలనుకుంటే మనోళ్లకు అవన్నీ పనికి వస్తాయి. ముందు ముందు రాబోయేవి అలాంటి సినిమాలేనేమో!