తమ మాజీ లవర్ పేరును కంప్యూటర్ కో, ఈ మెయిల్ అకౌంట్ కో పాస్ వర్డ్ గా పెట్టుకునే వాళ్లు కొందరైతే, ఏకంగా పిల్లలకే తన ఫస్ట్ లవర్ పేరును పెట్టుకుని అనుదినం తొలిప్రేమను గుర్తు చేసుకునే వాళ్లు మరికొందరు. ఈ రెండు కేటగిరిలకూ సంబంధించి కాదు కానీ.. మరో రకంగా మాజీ ప్రియుడి స్ఫూర్తితో తన సంతానానికి నామకరణం చేయబోతోందట కరీనా కపూర్.
వచ్చే నెలలో కరీనా ప్రసవించనుందని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. కరీనా ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మీడియాకు బోలెడన్ని వార్తలు దొరికాయి. కరీనా ప్రెగ్నెంటా కాదా? అనే అంశంతో మొదలుపెట్టి.. ఆమె పుట్టబోయే సంతానం విషయంలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుందని, కరీనా తొలి ప్రసవం లండన్ లో జరగనుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఈ పరంపరలో ఇప్పుడు కరీనా- సైఫ్ లకు పుట్టబోయే సంతానం నామకరణం విషయంలో కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీరికి పాప పుడితే .. తన పేరు ‘సైఫీనా’ అవుతుందనేది ఒక ఊహాగానం. కరీనా ఇదే ఆలోచనతో ఉందని అంటున్నారు. ఆ పేరు ప్రత్యేకత ఇట్టే అర్థం అవుతుంది. సైఫ్- కరీనాల పేరు కలగలుపుతూ ఉంది ఆ పేరు. సైఫ్ మతాచారం ప్రకారం పేరు కూడా సెట్ అయ్యేలానే ఉంది. కాబట్టి అదే పేరు కన్ఫర్మ్ అని అంటున్నారు.
మరి ఇక్కడ కరీనా మాజీ ప్రియుడి స్ఫూర్తి కూడా ఉండటం గమనించాల్సిన అంశం. అదెలా అంటే.. కరీనా మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ కొన్నాళ్ల కిందట వివాహం చేసుకుని ఒక ఇంటి వాడయ్యాడు. అతడి భార్య పేరు మీరా రాజ్ పుత్. వాళ్లిద్దరికీ పుట్టిన పాప పేరు ‘మీషా’. తమిద్దరి పేర్లూ కలిసి వచ్చేలా వారు పాపకు నామకరణం చేసుకున్నారు. కరీనా- సైఫ్ లకు కూతురు పుడుతుందని.. తనకు సైఫీనా అని పేరు పెడతారని, ఈ విధంగా కరీనా.. ప్రియుడి స్ఫూర్తిని పాటిస్తుందనేది బాలీవుడ్ జనాల గుసగుస! ఇది నిజమవుతుందో లేదో చూడాలి.