రాజుగారి గది 3.. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు ప్రకటించిన పేరు తమన్నా. ప్రారంభోత్సవానికి కూడా ఆమె వచ్చారు. కానీ తరువాత సీన్ మారింది. అవిక గౌర్ వచ్చి హీరోయిన్ గా చేరారు. అసలు ఏం జరిగింది? అదే విషయం ఓంకార్ ను ఇంటర్వూలో అడిగితే సినిమా నిర్మాత, దర్శకుడు ఓంకార్ ఇలా చెప్పారు.
''తమన్నాను ముందుగా కథానాయకగా అనుకున్న మాట వాస్తవం. అయితే అప్పటికి ఆమెకు లైన్ మాత్రమే చెప్పాం. సినిమా స్టార్ట్ కావడానికి కొద్దిరోజుల ముందు ఫుల్ నెరేషన్ ఇచ్చాం. దానికి ఆమె చాలా మార్పులు చెప్పారు. తన పాత్రను మార్చమని, దానికి అనుగుణంగా కథ మార్చమని అడిగారు. కానీ మాకు అంత సమయం లేదు.
దాంతో తమన్నాను వద్దనుకుని, వేరే వాళ్ల కోసం చూసాం. అవిక గౌర్ తో ముందుకు వెళ్లాం. అయితే చిత్రమేమిటంటే, అవిక గౌర్ రావడానికి ముందే ఎందుకు వచ్చిన సమస్య అని తమన్నా పాత్రనే మొత్తం మార్చేసి, హీరోపాత్రను పెంచాం. సినిమా మొత్తం హీరో భుజాల మీదకు తెచ్చాం. దాంతో అసలు ముందుగా అనుకున్న తమన్నా పాయింట్ ఆఫ్ వ్యూ కథ అలాగే వుంది. దాన్ని వీలయితే రాజగారిగది 4 కింద తీసే అవకాశం వుంది…''
ఇదీ ఓంకార్ సమాధానం. తమన్నా సినిమాను వదలుకోవడం వల్ల మంచే జరిగిందని, హీరో పాత్ర అన్నివిధాలా మారిందని, సినిమాలో వినోదానికి స్కోప్ పెరిగిందని ఆయన అన్నారు. తమన్నాకు బదులుగా తాప్సీ, కాజల్ ఇలా చాలామందిని ప్రయత్నించామని, అయితే ఎవ్వరి డేట్ లు అందుబాటులో లేవని, దాంతో ఆఖరికి అవిక గౌర్ ను తీసుకున్నామని, ఇది కూడా సినిమాకు ప్లస్ అని ఆయన అన్నారు.
అవికను తెలుగు జనాలు తమ ఇంటి మనిషిలా ఫీల్ అవుతారని, రెండేళ్ల గ్యాప్ తరువాత ఆమెను స్క్రీన్ పై చూడడానికి కచ్చితంగా ఆసక్తి కనబరుస్తారని ఓంకార్ అన్నారు. సినిమా క్లయిమాక్స్ మొత్తం అవిక మీదే వుంటుందని ఆయన వివరించారు.