Advertisement


Home > Movies - Movie Gossip
కొంప ముంచుతున్న కోటరీలు

సినిమా రంగంలో ఒక్కొక్కళ్లది ఒక్కో గ్రూపు. ఒకో డైరక్టర్ చుట్టూ ఒక్కో కొటరీ వుంటుంది. మీరు సూపర్ సార్.. మీరు తరుము.. మీరు తోపు అంటూ భజన చేస్తూ వుంటుంది. ఇక పొరపాటున ఆ డైరక్టర్ కు చాన్స్ వస్తే ఇక వీళ్లే ఆనందించేది. హమ్మయ్య అద్దెల బాకీలు తీర్చేయచ్చు, ఇఎమ్ ఐ వాయిదాలు కట్టేయచ్చు. ఓ బకరా నిర్మాత దొరికాడు అని కిందా మీదా అయిపోయేది. ఆ కోటరీలో వున్నవాళ్లే కథలు అల్లేది. ఆ కొటరీలో వున్నవాళ్లే మాటలు రాసేది, ఆ కోటరీలో వున్నవాళ్లే పాటలు కట్టేది. 

మరి కొత్తదనం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. కొత్త ఆలోచనలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. పట్టుమని పాతికేళ్లు రాని కుర్రాళ్లు, మీసాలు కూడా ఇంకా సరిగ్గా మొలవని పసివాళ్లు కొత్త కొత్త అయిడియాలు చేస్తుంటే, కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటే ఈ కొటరీ జనాలు మాత్రం అప్ డేట్ అవ్వడం అన్నది మరిచిపోయి, ఇంకా ఎక్కడో వుంటారు. ఇంకా కొరియన్ సినిమాల సీడీలు పట్టుకుని, కిందామీదా అవుతూ, వాటిని ఎలా తెలుగైజ్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. 

పెద్ద డైరక్టర్ లే పాపం, ఎక్కడో తేడా వచ్చింది. కెరీర్ అన్నాక ఒకటి రెండుఫ్లాపులు రావా ఎలాంటి వారికైనా అని భావించి, ఎవరో ఒక నిర్మాత అవకాశం ఇస్తాడు. అంతే సాంతం నాకేస్తారు. చూసుకోండి నా వాడకం ఎలా వుంటుందో అంటూ యథాశక్తి వాడేస్తారు. ఒక్కో డైరక్టర్ అయితే తక్కువలో ప్యాకేజ్ గా తీసిస్తా అంటాడు. తన దగ్గర బ్యాండ్ మేళం మాదిరిగా రెడీగా వున్న పాటలు, మాటలు, కథా రచయితలకు తలాకాస్తా పడేసి పని కానిచ్చేస్తారు. మిగిలిన టెక్నికల్ జనాలు కూడా అలాంటి వాళ్లే రేడీగా వుంటారు.

ఒక్కో డైరక్టర్ కు పక్కా బ్యాచ్ వుంటుంది. ఆ బ్యాచ్ నే పెట్టుకోవాలి. కథ వాడితే, మాటలు వాళ్లవే. వాటి స్థాయి అలాగే వుంటుంది. ఈ బ్యాచ్ లను, కోటరీలను దాటి బయటకు రాలేకపోతుంటారు ఈ డైరక్టర్లు. అందుకే అప్ డేట్ కాలేరు. జనం నాడి పట్టుకోలేరు. తాము ఏం తీస్తున్నామో, అది బాగుందో లేదో ఎవరినీ అడగలేరు. ఈ కోటరీ అడగనివ్వదు. పైగా తీసిన ప్రతి చెత్తనీ ఈ కోటరీ జనాలు సూపర్ సార్.. అయిడియా అదిరింది సార్.. అంటూ భజన చేస్తుంటారు. మరోపక్క అప్పుడప్పుడు ట్వీట్ లు కూడా చేసి ఎంకరేజ్ చేస్తుంటారు. దాంతో తాము తీసిందే సూపర్, అది అద్భుతం అనుకుంటారు.

ప్రొడక్ట్ బయటకు వచ్చి, జనాలు ఛీకొట్టాక, కూడా వీళ్లు మారరు. '... సార్ ఆ ఏపిసొడ్ కే పడీ పడీ నవ్వుతున్నారు సార్. సార్ ఆ డైలాగ్ అదిరిందంటున్నారు సార్..' అంటూ భజన సాగుతూనే వుంటుంది. కిట్టక సమీక్షలు రాసారు సార్. ఈస్ట్ లో టికెట్ లు బ్లాక్ లో అమ్ముతున్నారు సార్, వైజాగ్ మా ఫ్రెండ్ కు టికెట్ లు కావాలంటే నేను ఫోన్ చేసి ఇప్పించా సార్ అంటూ గప్పాలు కొడుతూనే వుంటారు. అవి అబద్దం అని తెలిసీ ఆ డైరక్టర్లు అలా వాటినే ఎంజాయ్ చేస్తూ, మరో బకరా ఎక్కడ దొరుకుతాడా? అని గాలం వేస్తుంటారు. 

ఇండస్ట్రీలో మరో ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు దోరుకుతారు. ఈ వ్యవహారం ఇలా సాగుతూనే వుంటుంది. స్క్రిప్ట్ దశలోనే, దండం పెట్టేసి, టీ ఇచ్చి మర్యాదగా పంపేసే నిర్మాతలు, లేదా స్వబుద్ధితోనో, లేదా సెకెండ్ ఒపినియన్ తోనో స్క్రిప్ట్ ను సరిగ్గా జడ్జ్ చేయగల నిర్మాతలు, పెరిగే వరుకు ఇలాంటి డైరక్టర్ల ఆటలు సాగుతూనే వుంటాయి.