కృష్ణవంశీ..ఇది..మీ ఆడియోనా?

'ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో'….'ఎటో వెళ్లిపోయింది మనసు…' 'అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందర నువ్వుండగా…'ఇలా రాసుకుంటూ పోతుంటే ఎన్ని పాటలు గుర్తుకొస్తాయో..ఎంత పొడుగు జాబితా తయారవుతుందో. దర్శకుడు కృష్ణవంశీ…

'ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో'….'ఎటో వెళ్లిపోయింది మనసు…' 'అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందర నువ్వుండగా…'ఇలా రాసుకుంటూ పోతుంటే ఎన్ని పాటలు గుర్తుకొస్తాయో..ఎంత పొడుగు జాబితా తయారవుతుందో. దర్శకుడు కృష్ణవంశీ చేసిన ప్రతి సినిమా హిట్ కావచ్చు..కాకపోవచ్చు..కానీ పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్,.ఇదంతా కొన్ని సినిమాల కిందటి వరకు మాత్రమే. మ్యూజికల్ హిట్ గా ఆయన ఆఖరు సినిమా శశిరేఖా పరిణయం. ఆ తరువాత మళ్లీ అంత చెప్పకోదగ్గ ఆల్బమ్ ఆయన దగ్గర నుంచి రాలేదు. ఆ మాటకు వస్తే చందమామ తరువాత ఆ రేంజ్ ఆల్బమ్ లేదు. మహాత్మలో పాపులర్ ప్రయివేటు ట్యూన్ లు వాడేసి కాలక్షేపం చేసారు. 

మళ్లీ చాన్నాళ్లకు కృష్ణవంశీ సినిమా వస్తోంది.  గోవిందుడు అందరివాడేలే..రామ్ చరణ్ లాంటి మాస్ హీరో. యువన్ శంకర్ రాజా సంగీతం. ఎలాంటి కాంబినేషన్ ఎన్ని అంచనాలు. కానీ ఆడియో మాత్రం కాస్త డిస్సపాయింట్ మెంట్ గానే వుంది. ఈ మాట అనడానికి కాస్త బాధగానే వుంటుంది. తప్పదు..వాస్తవం అంగీకరించాలి ఎవరైనా. ఇంతవరకు ఎవరు సంగీతం అందించినా కృష్ణవంశీ పాటలు మన నేటివిటీకి, మెలోడీకి దగ్గరగా వుండేవి. తొలిసారి గోవిందుడు పాటలు తమిళ వాసన కొడుతున్నాయి. 

పాటలు బాగున్నాయా..లేవా అన్నది కాస్సేపు పక్కన పెడితే, ఆ మాత్రం పాటలు చేయించుకోవడానికి కృష్ణవంశీనే అక్కరలేదు. యువన్ శంకర్ రాజా తమిళంలో చేసిన ఆల్బమ్ లు అన్నీ ఓపిగ్గా వెదికి, విని, వాటిలో క్యాచీగా వున్నవీ, తెలుగులోకి రానివి ఆరు పాటలు ఎంచుకుంటే ఓ పనైపోతుంది. ఈ అల్బమ్ వింటే అసలు అలాగే చేసారేమో అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే పాటలన్నీ క్యాచీగా వున్నాయి. అందులో సందేహం ఏ  మాత్రం లేదు.  కానీ కృష్ణవంశీ మార్కు కానీ, మన నేటివిటీ కానీ, ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ సినిమా పాటల స్టామినా కానీ లేవనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే సినిమా ఫీల్ గుడ్ అయినంత మాత్రాన పాటలు వెనకటి కాలం మాదిరిగా వుండక్కరలేదు.

ఆల్బమ్ లో మొదటి పాట నీలిరంగు చీరలోన..అచ్చమైన తమిళ బీట్. యువన్ శంకర్ రాజా పాటలంటే మనవాళ్లకు గుర్తుకు వచ్చే ఆడవారికి అర్థాలు వేరులే సినిమా పాటల మాదిరిగా. ఇక రెండో పాట 'గులాబీ ముళ్లు రెండు ముళ్లు చేసి' కాస్త స్పీడ్ బీటే కానీ, అది కూడా కాంటెంపరరీ స్టయిల్ లో లేదు. రామ్ చరణ్ డ్యాన్స్ చేయడానికి ఏమైనా అవకాశం వుంటుదేమో అని మాత్రమే అనిపిస్తుంది. ఇక మూడో పాట..కృష్ణవంశీకి ఇష్టమైన రచయిత సిరివెన్నెల రాసింది. 'రా..రాకుమారా..' ఈ పాట కేవలం కృష్ణ వంశీ తన మార్కు రొమాంటిక్ పిక్చరైజేషన్ కోసం రాయించుకున్న పాట. ఆయనకు ప్రతి సినిమాలో ఇలాంటిది ఒకటి వుండాలి. కానీ ఈ పాట కూడా వినేసిన ట్యూన్ లాగానో, పాత వాసనతోనో వుంటుంది తప్ప కోత్తదనం వినిపించదు. ఇనుస్ట్రుమెంటేషన్ లో మరీనూ. 

హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం..రామజోగయ్య శాస్త్రి..'ప్రతి చోటా నాకే స్వాగతం' పాట వింటే ఇలాంటి రిథమ్ కు రామ్ చరణ్ లాంటి అద్భుతమైన డ్యాన్సర్ ఎలాంటి మూవ్ మెంట్స్ ఇస్తాడా అన్న అనుమానం కలుగుతుంది. అల్బమ్ లో అయిదో పాట..'బావగారి చూపి బంతిపువ్వే పూసింది' పాట కూడా మళ్లీ తమిళ ట్యూన్. కానీ ఆల్బమ్ లో కాస్త మన నేటివిటీ కొంచెమైనా వినిపించేది ఈ పాటలోనే. తొలిపాట 'నీలిరంగు చీరలోన'..తరువాత కాస్త క్యాచీ ట్యూన్ కూడా ఇదే. ఆల్బమ్ లో ఆఖరి పాట..'కొక్కోడి' పాట అచ్చమైన తమిళ ట్యూన్. సందేహం లేదు. పదాలు కూడా డబ్బింగ్ పాట మాదిరిగా వినిపిస్తాయి. ఇందులో కాస్త డప్పుల బీట్ వుంటుంది కాబట్టి. అంతకన్నా గొప్ప అవకాశం ఏమీ వుండదు. ఈ పాటలోనే కాదు, మరే పాటలోనూ కూడా,.రామ్ చరణ్ అంటే మాంచి డ్యాన్స్ లు వుండాలి. ఎంత ఫీల్ గుడ్ సినిమా అయినా అది తప్పదు. మరి అందుకు ఈ పాటలు ఎంత వరకు సహకరిస్తాయో చూడాలి.

ఈ సంగతి అలా వుంచితే, అసలు కృష్ణవంశీ ఎందుకు ఏ సంగీత దర్శకుడి దగ్గర కుదరుగా మ్యాచ్ కాలేకపోతు్న్నాడో అర్థం కాదు. ప్రారంభంలో ఇళయరాజా తో కొన్ని సినిమాలు వరుసగా చేసారు. ఆ తరువాత నుంచీ మారుస్తూ వస్తున్నారు. కానీ ఇళయరాజా తరువాత రాధాకృష్ణన్ ఇచ్చినంత మంచి ఆల్బమ్ మరి ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. పోనీ ఆయనతో అన్నా జర్నీ కంటిన్యూ చేస్తే బాగుండేది. ఆయన్నీ వదిలేసారు. శశరేఖా పరిణయం కు మణిశర్మను పట్టుకుని, మళ్లీ విద్యాసాగర్ ను కూడా కలుపుకున్నారు. ఆ తరువాత ఎవరెవరినో వర్తమాన సంగీత దర్శకులను ట్రయి్ చేస్తూ వచ్చారు. ఇప్పడు మళ్లీ యువన్ శంకర్ రాజా దగ్గరకు చేరారు. కానీ ఆ ఆల్బమ్ కూడా ఇలా..

అంతే ఇక కృష్ణవంశీ పాటల అభిమానులు..తాతల మూతుల వాసనలు చూసుకోవడమే.

'చిత్ర'గుప్త