మొత్తానికి ఎస్జే సూర్య టైమ్ బాగున్నట్టుగా ఉంది. మహేశ్ బాబు 'స్పైడర్' సినిమాతో మంచి పేరు వచ్చేసింది. సినిమా అయ్యాకా చాలామంది విలన్ పాత్ర గురించి మాట్లాడటం కనిపిస్తోంది. హీరో పాత్రకు ధీటుగా.. సూర్య పోషించిన పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. కొంతమంది విశ్లేషకులైతే.. హీరో పాత్రకన్నా సూర్య విలన్ పాత్రనే ఎక్కువగా లైక్ చేసినట్టుగా ఉన్నాడు, అందుకే అంత వర్క్ చేసుకున్నాడు.. అని అంటున్నారు. అంత ఎఫెక్టివ్‌గా ఉంది సూర్య పాత్ర.
దాన్ని అతడు పోషించిన విధానం కూడా అంతే స్థాయిలో ఉందని చెప్పక తప్పదు. మరి ఈ పాత్రకు సూర్యను ఎంపిక చేసినప్పుడు చాలామంది తెలుగు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఎస్జే సూర్య ఏమిటి? విలన్ పాత్రకు ఏమిటి.. అన్నట్టుగా చూశారు. అప్పటికీ సూర్య తమిళంలో నటించిన పలు సినిమాలు తెలుగులోకి అనువాదం అయినప్పటికీ మనోళ్లు ఇతడిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. మహేశ్ బాబుకు ఇంతకు మించిన విలన్ దొరకలేదా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి, అయితే.. అన్ని ప్రశ్నలకూ సూర్య అద్భుత నటన సమాధానం ఇచ్చింది.
మరి ఈ పాత్రను ఎంచుకోవడం గురించి కూడా గతంలో సూర్య కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. పవన్ కల్యాణ్ సినిమా దర్శకత్వం అవకాశాన్ని వదిలేసుకుని సూర్య.. మహేశ్ బాబు సినిమాలో పాత్రకు ఓకే చెప్పాడు. పవన్ కల్యాణ్ హీరోగా, సూర్య దర్శకత్వంలో కొన్నినెలల కిందట ఒక సినిమా ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూర్య ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఎందుకు? అని మీడియా అడిగితే, తనకు నటనతో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, అందుకే దర్శకత్వం అవకాశాన్ని వదులుకుని విలన్ పాత్రను ఎంచుకున్నానని ఎస్జే సూటిగా చెప్పాడు. దర్శకత్వం కన్నా నటనతోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని సూర్య వివరించాడు.
అదీ నిజమే, దర్శకుడు అయితే.. సినిమా విజయానికి, ఫెయిల్యూర్‌కు బాధ్యత వహించాలి. అదే నటన అయితే.. ఆ సినిమాతోనే పోతుంది. ఒకవేళ పవన్‌తో సినిమా హిట్ కాకపోతే.. అంతటితో దర్శకుడిగా కెరీర్ క్లోజ్ అవుతుంది. మళ్లీ అవకాశాలు పుట్టడం గగనమే.
మహేశ్ బాబు సినిమా బైలింగ్వల్ కావడం సూర్యకు కలిసి వచ్చింది. లేకపోతే ఈ సినిమాలో విలన్ పాత్ర ఇతడికి దక్కేదే కాదేమో. కొత్త విలన్ కావాలి, అది తెలుగు, తమిళ భాషలకు తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి.. అవకాశం సూర్యకు దక్కింది.
అయితే ఒకింత విచారకరం ఏమిటంటే.. సూర్య లాంటి దర్శకుడు నటుడిగా మిగిలిపోవడం. ఇప్పుడు కాదనుకోండి.. చాలా సంవత్సరాల కిందటే సూర్యలోని దర్శకుడు పాపర్ ఎత్తిపోయాడు. తన కెరీర్ ఆరంభంలో సూర్య తీసిన సినిమాలకు సౌతిండియాలో బోలెడంత మంది ఫిదా అయిపోయారు. రామాయణంలోని వాలీ-సుగ్రీవుల ఘట్టాన్ని తీసుకుని ఎస్జే సూర్య 'వాలి' సినిమాను తెరకెక్కించిన తీరు అతడి పటిమను తెలియజేస్తుంది.
గత కొన్ని దశాబ్దాల్లో సౌతిండియాలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో నిస్సందేహంగా 'వాలి' ఒకటి అవుతుంది. ఆ తర్వాత వాలి ఫార్ములాలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి, కొంతమంది అయితే ఆ సినిమాలోని లవ్ ఎసిపోడ్స్ను మొహమాటం లేకుండా కాపీ కొట్టేశారు. అలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాను రూపొందించాడు సూర్య. ఇక 'ఖుషీ'తో తను ఎంత సెన్సిబుల్ డైరెక్టర్ నో అతడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.
ఏతావాతా ఆ సమయానికి సూర్య నిస్సందేహంగా గొప్ప డైరెక్టర్. అయితే ఆ ఫామ్ కొనసాగించలేకపోయాడు. హాలీవుడ్ సినిమాను కాపీకొట్టి తీసిన తెలుగు 'నాని' సూర్యను చాలా సగటు దర్శకుడిగా మిగిల్చేసింది. ఆ సినిమా తమిళంలో 'న్యూ'గా రూపొందింది. అందులో సూర్యనే నటించాడు. అక్కడ కమర్షియల్‌గా విజయం సాధించింది. సూర్యలోని దర్శకుడు అక్కడితో అయిపోయాడు. తర్వాత వివిధ సినిమాల్లో నటించాడు. మళ్లీ పవన్ కల్యాణ్ 'పులి'తో రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. 'వాలి' తీసిన ఎస్జే సూర్య, 'పులి' తీసిన ఎస్జే సూర్య.. ఒకడే అంటే నమ్మడం కష్టం. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లోనే సూర్య సినిమాల్లో కనిపించడం మొదలుపెట్టాడు.
వసంత్ దర్శకత్వంలో, మణిరత్నం నిర్మించిన 'ఆశ ఆశ ఆశ' సినిమాలో ఒక ఆటో డ్రైవర్‌గా కనిపిస్తాడితను. అజిత్ అందులో హీరో. ఆ తర్వాత సూర్య దర్శకత్వంలో అజిత్ 'వాలి'లో నటించడం గమనార్హం. మరి ఇప్పుడు అలాంటి నటనే సూర్యను మళ్లీ నిలబెట్టేట్టుగా కనిపిస్తోంది. 'స్పైడర్'తో మంచి పేరును తెచ్చుకుంటూ పరిచయం అయ్యాడు కాబట్టి.. ఇతడిని మరిన్ని విలన్ పాత్రలు పలకరించవచ్చునేమో!