నితిన్-హను రాఘవపూడి కాంబినేషన్ లోని లై సినిమా శాటిలైట్ హక్కుల బేరం కాస్త జోరుగానే వుంది. జీ టీవీ, జెమినీ టీవీ కాస్త గట్టిగానే పోటీ పడుతున్నాయి. జెమిని టీవీ ఫైనల్ గా ఏడు కోట్లు ఆఫర్ చేసింది. నితిన్ సినిమాకు ఏడు కోట్ల శాటిలైట్ అంటే అది రికార్డు ఫిగర్ నే.
అయితే ఏడున్నర కావాలని నిర్మాతలు పట్టుపడుతున్నారు. జీ టీవీ కనుక ఆ యాభై లక్షలు అదనంగా ఇస్తే దానికే శాటిలైట్ హక్కులు దఖలు పడతాయి. లేదూ ఏడు కోట్ల దగ్గరే అంటే జెమినీకే వెళ్తాయి. ఏ విషయం ఈ సాయంత్రానికి కానీ రేపటికి కానీ తేలుతుంది.
ఇదిలా వుంటే ఇది కేవలం శాటిలైట్ హక్కులకు మాత్రమే. డిజిటల్ రైట్స్ కు అమెజాన్ తో బేరాలు సాగుతున్నాయి. అడియో హక్కులు మాత్రం 45లక్షలకు ఆదిత్య మ్యూజిక్ కు ఇచ్చేసారు. లై సినిమా కాస్త గట్టి బడ్జెట్ తోనే తయారవుతోంది.
యాక్షన్ కింగ్ అర్జున్, హీరో నితిన్ ల నడుమ మైండ్ గేమ్ గా సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అప్పటి నుంచి సినిమాకు బజ్ అమాంతం పెరిగిపోయింది. థియేటర్ రైట్స్ కూడా కాస్త గట్టిగానే చెబుతున్నారు. నైజాం మాత్రం నితిన్ స్వంత సంస్థ ద్వారా పంపిణీ చేస్తారని తెలుస్తోంది.