రజనీ సినిమా అంటేనే భయంకరమైన క్రేజ్..ఇక రవికుమార్ జోడయితే చెప్పనక్కరలేదు. మాంచి మాస్ ఎంటర్ టైన్ మెంట్ పుట్టుకువస్తుంది. అందుకే బయ్యర్లు ముందు వెనుక చూడకుండా బరిలోకి దిగి హక్కుల కోసం పోటీ పడతారు. ఇప్పుడు అదే జరిగింది రజనీ లేటెస్ట్ లింగా సినిమాకు.
ఓ పక్క సినిమా రెడీ అవుతుంటేనే సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్, దాని అనుబంధ సంస్థలు ఎగరేసుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ దక్షిణాది సినిమాకు రానంత ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి,. ఒక్క ఓవర్ సీస్ మినహా అన్ని హక్కులు, నాన్ థియటరికల్ వ్యవహారాలతో సహా 125 కోట్లకు తీసుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అదే సమయంలొ ఓవర్ సీస్ తో కలిపి 140 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ అంకెలే ఇంత భారీగావుంటే మరి విడుదలయ్యాక వచ్చే అంకెలు ఇంకెలా వుంటాయో?
ఇటీవలే విజయ్-మురుగదాస్ సినిమా కత్తి వంద కోట్లు అవలీలగా దాటేసింది. ఇప్పుడు లింగా..మొత్తానికి తమిళ సినిమా కూడా బాలీవుడ్ మాదిరిగా తయారవుతోంది. మరి తెలుగు సినిమా ఇంకా అరవై, డెభై దగ్గరే వుంది. పెద్ద హీరొలు అనుకునే జనాలు నలభై దాటితే చాలు పరువు దక్కుతుంది అనుకునే పరిస్థితిలో పడ్డారు. మరి వంద ఎక్కడ? బాహుబలి ఒక్కటే ఆ రేంజ్ సినిమా కళ్ల ముందు కనిపిస్తోంది.