మొత్తానికి అనుకున్నంతా అయింది. బాలయ్య బాబు లయన్ మళ్లీ వాయిదా పడింది. వాయిదా పడుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. అది వాయిదా పడుతుందనే ధైర్యంతోనే చిన్న సినిమాలు దాగుడు మూతల దండాకోర్, దొంగాట విడుదలకు ధైర్యంగా రెడీ అయ్యాయి. లయన్ అసలు సమస్య అమ్మకాలు. సినిమాకు నిర్మాత 35 కోట్ల వరకు ఖర్చు చేసారని వినికిడి. దాంతో దాన్ని యాభై కోట్లకు అమ్మాలని చూసారని బయర్ల సర్కిల్ సమాచారం.
కానీ ఎవరూ అంత రేటుకు కొనడానికి ముందుకు రాలేదు. బాలయ్య సినిమాల రెగ్యులర్ బయ్యర్లు రెడీగా వున్నారు. కానీ ఈ రేటుకు వీలు కాదన్నారు. లెజండ్ అంత సూపర్ డూపర్ హిట్ అయితేనే నలభై దాటి ఊరుకుంది. మరి దీనికెలా? పైగా కొత్త డైరక్టర్. అయితే నిర్మాత కాస్త అటు ఇటుగా ఇచ్చేద్దామనే అనుకున్నారట. కానీ సినిమా నిర్మాణ వ్యవహారంలో కీలకగా వున్న మరో పెద్దాయిన మాత్రం ససేమిరా వీల్లేదు..అని భారీ రేట్లు చెబుతూ వచ్చారు.
దాంతో విడుదల తేదీ దగ్గరపడినా అమ్మకాలు కుదరలేదు. దీనికి తోడు నిర్మాత కాస్త భారీగానే ఫైనాన్స్ తెచ్చారని టాక్ . దాంతో ఇప్పుడు నిర్మాత జోక్యం చేసుకుని, కాస్త మార్జిన్ లో అమ్మకాలు చేసేయాలని రంగంలోకి దిగారు. అయినా ఇంకా ఏరియాలు పెండింగ్ లో వున్నాయట. అందుకే వాయిదా పడిందని అంటున్నారు. నిజానిజాలు నిర్మాతకే తెలియాలి. ఇలా వాయిదా పడడం ఇది మూడోసారి. 30 అన్నారు, 8 అన్నారు, ఇప్పుడు 14 అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.