మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.. కాస్త లేటుగా ఫలితాలూ వచ్చాయి. సినీ ఇండస్ట్రీ ఈ ఎన్నికల వ్యవహారాన్ని మర్చిపోయింది కూడా. కానీ, విచిత్రంగా ‘మా’ ఎలక్షన్స్ గురించి జనం ఇంకా చర్చించుకుంటున్నారు. అలా ఇలా కాదు, ఎక్కడ చూసినా ‘మా’ ఎన్నికల గురించిన చర్చే జరుగుతుండడం ఆశ్చర్యకరమైన విషయమే.
‘మా’ అధ్యక్షుడిగా ఎవరు పదవిలో వున్నా, వారికి లభించే ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఏమీ వుండదు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక, సాధారణ ప్రజానీకం అయితే సినీ రంగంలో జరిగే ఈ ఎన్నికల గురించి పట్టించుకోరు. అయితే, ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి తలెత్తిన రాజకీయం కారణంగా, జనం అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు ఈ వ్యవహారాన్ని.
జయసుధ ఓడినందుకు చాలామంది పార్టీలు కూడా చేసుకున్నారట. జయసుధను రంగంలోకి దించిన మురళీమోహన్ వెనకాల పెద్ద తలకాయలు వుండడంతో, రాజేంద్రప్రసాద్ ఓటమి ఖాయమంటూ బెట్టింగ్‌లు ఎడా పెడా జరిగాయి. లక్షలు చేతులు మారాయి. ఆ మాటకొస్తే, కోట్లలోనే బెట్టింగ్ జరిగిందంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అందులో డబ్బులు పోగొట్టుకున్నవారు, సామాజిక వర్గ సమీకరణాల్ని లెక్కలేసుకున్నవారూ.. ఇలా ఈ ఎన్నికల గురించి ఇంకా ఇంకా చర్చించుకుంటున్నారు.
మొత్తమ్మీద, ‘మా’ ఎన్నికలు ఈసారికి అత్యంత వివాదాస్పదంగా జరిగాయి. ఇక ముందు.. అంటే రెండేళ్ళ తర్వాత మళ్ళీ జరిగే ‘మా’ ఎన్నికల కోసం ఎవరు పోటీ చేయాలనుకున్నా, కొంత ఎన్నికల బడ్జెట్ రెడీ చేసుకోవాలేమో.! ఎందుకంటే, అప్పుడు ఎన్నికలు అంత ఆషామాషీగా జరగవు. అప్పటికి మెంబర్స్ కూడా అనూహ్యంగా పెరుగుతారని ఇండస్ట్రీలోనూ అనుకుంటున్నారు.