మహానటి సినిమా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న బయోపిక్. ఇండస్ట్రీలోని చాలా మంది సీనియర్ల ఫేస్ లు ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు అలనాటి యస్వీరంగారావు పాత్రలో కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే. సినిమాలో సందర్భానుసారంగా అలనాటి సినిమా జనాల పాత్రలు చాలా కనిపిస్తాయి.
ఇవన్నీ ఒక ఎత్తు, ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలు మరొక ఎత్తు. వారి పాత్రలు లేకుండా సావిత్రి సినిమా జీవితం లేదు. అందువల్ల మహానటి సినిమాకు ఆ ఇద్దరి పాత్రలు కీలకం. ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులు ఇద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో వున్నారు. పైగా వైజయంతీ సంస్థ అటు నందమూరి, ఇటు అక్కినేని నటులతో అనేక సినిమాలు నిర్మించింది. అసలు వైజయంతీ ప్రారంభమైనదే ఎన్టీఆర్ తో.
అందువల్ల నిజానికి బాలయ్య, నాగార్జున తమ తమ నాన్నల క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది.అయితే నిర్మాతలు నాగచైతన్య-జూనియర్ ఎన్టీఆర్ లను అప్రోచ్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ఓకె అంటే తాను రెడీ అని చైతన్య చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే ఎన్టీఆర్ విషయంలోనే క్లారిటీ లేదు. ఒకసారి చేస్తా అన్నారని, మరోసారి లేదు అన్నారని వార్తలు వినవచ్చాయి.
వాస్తవం మాట్లాడుకోవాలంటే, ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాతోనే వైజయంతీ మూవీస్ పరిస్థితి చాలా దెబ్బతింది. అది దృష్టిలో పెట్టుకుని అయినా ఎన్టీఆర్ వెంటనే ఓకె అని సహకరించడం నైతిక ధర్మం. కానీ తాత పాత్ర చేయడం మినహా మరేం చేయమన్నా చేస్తానని ఎన్టీఆర్ క్లియర్ గా చెప్పేసినట్లు తెలుస్తోంది.
మరి ఎన్టీఆర్, ఎఎన్నార్ పాత్రలు ఎవరు పోషిస్తున్నారన్న విషయంలో మహానటి యూనిట్ సైలెంట్ గా వుంది. ఓవర్ సీస్ బయ్యర్లకు మాత్రం ఆ ఇద్దరు సినిమాలో వుంటారు అని చెప్పే, భారీ రేటుకు అమ్మారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య-ఎన్టీఆర్ లను ఒప్పించగలిగితే మహానటికి మాంచి క్రేజ్ వచ్చేస్తుంది. కానీ ఏం జరుగుతుందో అన్నదానిపై యూనిట్ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం బయటకు రావడం లేదు.