మహేశ్ సినిమాకు ఇక ఫుల్ వసూళ్లా!

ఇక్కడ ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు హోరుగా జరుగుతున్న వేళ.. వాటిపై స్పందించేందుకు ప్రిన్స్ మహేశ్ బాబుకు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తీరిక లేకపోయింది! వీళ్ల బతుకులు తెలుగు ప్రేక్షకులు విదిల్చే…

ఇక్కడ ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు హోరుగా జరుగుతున్న వేళ.. వాటిపై స్పందించేందుకు ప్రిన్స్ మహేశ్ బాబుకు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తీరిక లేకపోయింది! వీళ్ల బతుకులు తెలుగు ప్రేక్షకులు విదిల్చే కాసుల మీద ఆధారపడి ఉన్నా.. వీళ్ల మూలాలు తెలుగు గడ్డలతో ముడిపడి ఉన్నా.. తమ తెలుగు వాళ్లే రోడ్డెక్కినా, శరీరాలు కాల్చుకుంటున్నా, ఆ పేగు కాలిన వాసన వీరిని కదిలించలేకపోయింది!

సరే.. సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల విషయంలో వీరు స్పందించలేకపోయారని అని అనుకుందాం! ఎటు చెప్పాలో తెలియక సతమతమవుతూ.. తమ ట్విటర్ లను మూసుకున్నారని అనుకుందాం! ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంతో సహా.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి! అయితే.. వాటిల్లో వేటి మీద కూడా ఈ హీరోలు ధాటిగా స్పందించిన దాఖలాలు లేవు.

పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతాడో, ఆయన విజనేంటో.. ఏ సమస్య మీద ఆయన దృక్పథం ఏమిటో సామాన్యుడికి అంతుబట్టడం లేదు. ఇక మహేశ్ బాబు అయితే.. ఏపీ వ్యవహారాల గురించి, జనాల సమస్యల గురించి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటాడు. తన బావను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేయడమే తప్ప.. ఇక మరే సోషల్ ఇష్యూల మీదా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. తెలుగు వాళ్లు ప్రత్యేక రాష్ట్రం, సమైక్యం అంటూ కొట్టుకుంటున్న వేళ కానీ, ప్రత్యేక హోదాపై జనాలు ఆందోళనలతో నిండిన వేళ కానీ.. మహేశ్ మారు మాట్లాడలేదు!

అయితే.. ఎటొచ్చీ తమిళులు రోడ్డెక్కే సరికి మాత్రం మహేశ్ హృదయం ద్రవించి పోయింది. వాళ్ల స్పిరిట్ గొప్పదని మహేశ్ కితాబులిచ్చేశాడు. మరి తెలుగు వాళ్ల సమస్యల మీదైతే స్పందించే తీరిక ఉండదా? తమిళుల విషయంలో అయితే టక్కున స్పందించేస్తారా? ఇదంతా.. త్వరలో తమిళనాట కూడా విడుదల అయ్యే తన సినిమా ను దృష్టిలో ఉంచుకుని స్పందించడమేనా? ఇలా అయితే మహేశ్ సినిమాకు తమిళంలో ఫుల్ వసూల్లుంటాయేమో! 
అయినా.. మహేశ్ అయినా, పవన్ అయినా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. తమిళోల్లు  తెలుగు వాళ్లంతటి వెర్రిబాగుల వాళ్లు కాదు, వాళ్ల సమస్య గురించి వీళ్లు ఇప్పుడే ఎందుకు స్పందించారో, వీళ్ల లెక్కలు ఏమిటో తమిళులకు అవగాహన లేని అంశాలు కాదు సుమా!