కోలీవుడ్ లో బిజీగా ఉన్న రోజుల్లో తెలుగు సినిమాల్ని అస్సలు పట్టించుకోలేదు. చివరికి చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ సినిమాలో ఆఫర్ చేసినప్పటికీ సాకులు చెప్పి తప్పించుకుంది. ఇప్పుడు నయనతార తమిళనాట ఫ్రీ అయింది. కుదిరితే తెలుగులో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉంది. కానీ ఈసారి ఈమెను పట్టించుకోవడానికి తెలుగు హీరోలు, నిర్మాతలు సిద్ధంగా లేరు.
మొన్నటివరకు అరమ్, వేళైకరన్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఆరమ్ సినిమాను కంప్లీట్ చేసింది. వేళైక్కరన్ సినిమా కూడా మరో నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. సో.. ఈ నెలాఖరుకు ఆమె ఖాళీ. అందుకే తెలుగులో ప్రయత్నాలు షురూ చేసింది నయన్. ఇందులో భాగంగా వెంకటేష్ కొత్త సినిమాలో ఛాన్స్ కోసం సంప్రదింపులు జరిపిందట. అయితే బాబు బంగారం సినిమా టైమ్ లో నయన్ ఏ రేంజ్ లో యూనిట్ కు చుక్కలు చూపించిందో అందరికీ తెలిసిందే. ఆ అనుభవం దృష్ట్యా నయనతారకు వెంకీ మళ్లీ ఛాన్స్ ఇస్తాడని ఎవరూ అనుకోరు.
ఇక చిరంజీవి అయితే ఇప్పటికే నయన్ పై అన్-అఫీషియల్ నిషేధం విధించారట. 151వ సినిమాలో హీరోయిన్ పొజిషన్ ఖాళీగానే ఉంది. కానీ నయనతార తప్ప ఎవరైనా ఓకే అనే కండిషన్ ఉందట. నాగ్, బాలయ్య కూడా తాము చేస్తున్న సినిమాలకు ఆల్రెడీ హీరోయిన్లను ఫిక్స్ చేసేశారు. సో.. ప్రస్తుతానికైతే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో చోటు లేదు.