‘మనం’ సినిమాకి ఎందుకింత అవమానం.?

తెలుగు సినీ పరిశ్రమకి స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎలాగో, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కూడా అలాగే. అలాంటి స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం 'మనం' నంది అవార్డులకు సంబంధించి తీవ్రమైన అవమానానికి గురయ్యిందంటూ…

తెలుగు సినీ పరిశ్రమకి స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎలాగో, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కూడా అలాగే. అలాంటి స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం 'మనం' నంది అవార్డులకు సంబంధించి తీవ్రమైన అవమానానికి గురయ్యిందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

'చివరి శ్వాస విడిచేవరకూ నటిస్తూనే వుంటా..' అని అక్కినేని ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటని ఆయన నిలబెట్టుకున్నారు. లేటు వయసులో ఏదో తూతూ మంత్రం సినిమా చేసెయ్యలేదాయన. తెలుగు సినీ పరిశ్రమకు ఓ అద్భుతమైన చిత్రాన్ని అందించి వెళ్ళారు. 'అక్కినేని లివ్స్‌ ఆన్‌..' అంటూ ఆ సినిమా ప్రేక్షుల ముందుకొచ్చింది.. ఘనవిజయం సాధించింది. నిజమే, అక్కినేని నాగేశ్వరరావు ఇప్పటికీ జీవించే వున్నారు.. అదీ 'మనం' సినిమా రూపంలో. ఆ సినిమా పోస్టర్లలో ఆయన చిరునవ్వు, సినిమాలో ఆయన ఎనర్జీని చూశాక ఎవరైనా.. అక్కినేని 'ఇక లేరు' అని అనగలరా.? 

'మనం' ఆషామాషీ సినిమా ఏమీ కాదు. పూర్తిగా కొత్తదనంతో కూడుకున్న సినిమా ఇది. కథ పరంగా, స్క్రీన్‌ప్లే పరంగా, సంగీతం పరంగా.. ఎలా చూసినా, 'మనం' ది బెస్ట్‌ సినిమాగా చెప్పొచ్చు.. నంది అవార్డుల్లో ప్రధమ స్థానం దక్కించుకున్న 'లెజెండ్‌' సినిమాతో పోల్చి చూస్తే. కానీ, 'లెజెండ్‌' ముందు 'మనం' ఓడిపోయింది. కాదు కాదు ఓడించేశారు. అవార్డు ఇవ్వకపోయినా ఫర్లేదు.. అసలు నంది అవార్డులకు గౌరవం ఏనాడో తగ్గిపోయింది. కానీ, రెండో స్థానం ఇవ్వడం.. పైగా, నాగచైతన్యకు 'సహాయ నటుడు' కేటగిరీలో పురస్కారం ఇవ్వడం.. ఖచ్చితంగా 'మనం' సినిమాని అవమానించడమే. 

ఇంతకీ, 'మనం' సినిమాకి ఎందుకింత అవమానం జరిగినట్లు.? 'నంది' అవార్డుల కమిటీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది. చెప్పగలదా మరి.?