మన టాలీవుడ్ లో టాప్ హీరోలంటే దేవుళ్లకన్నా గొప్పోళ్లు. దేవుళ్లనయినా, గర్భగుడికి కాస్త దూరంలో వుండి చూడొచ్చు. కానీ మన హీరోలను విడియోల్లో చూసుకోవడమే. గతంలో మీడియాతో పెద్ద హీరోలు కాస్త రాపో మెయింటెయిన్ చేసేవారు. కానీ ఇప్పుటి టాప్ హీరోలంతా మీడియాకు మహా దూరం. వాళ్ల సినిమాలు విడుదలైతే, ఏ మీడియాకు ఇంటర్వూ ఇవ్వాలా అని ఎంచుకుంటారు. మిగిలిన వారికి ఓ విడియో తీసి విదిలిస్తారు. ఆ మిగిలిన మీడియా అంతా అదే మహా ప్రసాదం అని, కళ్లకద్దుకుని ప్రచారం చేస్తుంది. ఈ హీరోలను ఇంటర్వూ చేయడానికి మీడియా జనాలు సరిపోరు. అందమైన ఏంకర్లు కావాలి.
అందమైన ఏంకర్లు అంటే గుర్తుకు వచ్చింది. ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్ అయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. స్టేజ్ మీద ఏంకర్ ముందుగా మాట్లాడాల్సి వుంది. కానీ సదరు ఏంకర్ ఆ సినిమా చూడలేదు. ఊరినుంచి డైరక్ట్ గా ఫంక్షన్ కు వచ్చేసింది. దాంతో ఎవరినో అడిగి నాలుగు వివరాలు తెలుసుకుంది. మాట్లాడేసింది. దాంతో 'అబ్బ ఏం ఎనలైజ్ చేసింది' అనేసారంతా. నిజం తెలిసిన వాళ్లు నవ్వుకున్నారు. సరే, ఇలాంటి ఏంకర్లతో తప్ప, అనుభవం వున్న మీడియా జనాలు మన హీరోలకు ఆనరు. మరీ కాదంటే మరో హీరో, లేదా సినిమాలో నటించిన మరో నటుడు, వీళ్లంతా కలిసి స్టూడియోలో నాలుగు గోడల మధ్య చిట్ చాట్ చేసి, దాన్ని బాగా మెరుగులు దిద్ది అప్పుడు వదుల్తారు. అంతే కానీ మీడియాను ఫేస్ చేయమన్నా చేయరు.
గోవిందుడు అందరి వాడేలే సినిమాకు ప్రెస్ మీట్ పెట్టగలిగాడు రామ్ చరణ్. బాహుబలికి ప్రభాస్ సెలెక్టెడ్ మీడియాను మాత్రం కలవగలిగాడు. అసలు మిగిలిన 95శాతం మీడియాను బాహుబలి కాంపౌండ్ కే పిలవలేదు. ఇప్పుడు మహేష్ బాబు ఈ గోడ బద్దలు కొట్టాడు. నేరుగా ఈ మీడియా, ఆ మీడియా అని కాకుండా, అందరితోనూ సమావేశం జరిపాడు. విడిగా కావాల్సిన వారందరికీ ఇంటర్వూలు ఇచ్చాడు.
అంతే కాదు, బ్రహ్మోత్సవం నిర్మాతలకు కూడా చెప్పేసాడు. సినిమా విడుదల తేదీకి ముందు తనకు నెల రోజులు మీడియా ఇంట్రాక్షన్ కు సమయం వుండేలా చూడమని. మొత్తానికి ఇప్పుడు మహేష్ ఓ మంచి బాట చూపాడు. మీడియాకు ఇంటర్వూలు ఇస్తే తన సినిమాకే మంచిదని, హైప్ వస్తుందని గ్రహించాడు. ఇక గ్రహించాల్సింది మీడియానే. తాను అవసరం లేని వారిని గుర్తించి, వారి కోసం పాకులాడడం, అనవసరపు ప్రచారం సాగించడం తగ్గించాలేమో?