మను డైరక్టర్ పుణ్యమా అని..

సినిమాకు సంబంధించినంత వరకు డైరక్టర్ గొప్పోడే. ఆయనదే సర్వ బాధ్యతలు. కానీ నిర్మాత శ్రేయస్సును, తనకు అవకాశం ఇవ్వడానికి నిర్మాతలు పెట్టిన కోట్ల పెట్టుబడిని కూడా డైరక్టర్ దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకానీ, తన క్రియేటివిటీ,…

సినిమాకు సంబంధించినంత వరకు డైరక్టర్ గొప్పోడే. ఆయనదే సర్వ బాధ్యతలు. కానీ నిర్మాత శ్రేయస్సును, తనకు అవకాశం ఇవ్వడానికి నిర్మాతలు పెట్టిన కోట్ల పెట్టుబడిని కూడా డైరక్టర్ దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకానీ, తన క్రియేటివిటీ, తన మేధావితనం అని చూస్తే, నిర్మాత డబ్బులు గల్లంతయిపోతాయి. 

ఈవారం విడుదలయిన మను సినిమా ది ఇలాంటి వ్యవహారమే. వాస్తవానికి డైరక్టర్ టెక్నికల్ బ్రిలియన్స్ సినిమాలో వుంది. మంచి థాట్ వుంది. మంచి టెక్నికల్ స్టామినా వుంది. కానీ స్క్రిప్ట్ ప్రెజెంటేషన్, ఎడిటింగ్, స్లో పేస్ నేరేషన్, చెక్కుడు లాంటి సమస్యలు వున్నాయి.

ఇవన్నీ సినిమా విడుదలకు ముందే నిర్మాతలు గమనించారట. ఈ సినిమాను ముందుగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించారు. సుమారు 115 మంది నిర్మాతలు ఈ సినిమాకు కోటిన్నర ఖర్చు చేసి తీసారు. అయితే సినిమా గురించి తెలుసుకుని, ప్రాజెక్టు ఎలా వస్తోందో చూసి, ఓవర్ సీస్ లో టేస్ట్ ఫుల్ గా సినిమాలు అందిస్తున్న నిర్వాణ మూవీస్ మను సినిమాను టేకోవర్ చేసింది. 

మూడున్నర కోట్లు ఇచ్చి, టోటల్ గా ప్రాజెక్టును తీసుకుంది. తీరా ఫినిష్ అయిన తరువాత డైరక్టర్ నెరేషన్ వ్యవహారాలు, మూడు గంటల నిడివి చూసి, నిర్వాణ మూవీస్ అధినేత సృజన్ ఓ ఇరవై నిమషాలు సినిమా తగ్గిద్దామని డైరక్టర్ ఫణీంద్రను కోరినట్లు తెలుస్తోంది. 

దానికి ఫణీంద్ర ససేమిరా అన్నారని, తెలుగు సినిమా ఈ కొత్త పోకడకు అలవాటు పడుతుంది, మీరే చూస్తారు. మీకు తేడా వస్తే నేనున్నా అన్న టైపులో సమాధానం చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతకు, దర్శకుడికి మధ్య కాస్త గట్టి వాదన కూడా అయినట్లు వినికిడి. ఆఖరికి ఇంక చేసేది లేక నిర్వాణ సృజన్ మౌనం వహించి, సినిమాను అలాగే విడుదల చేసారు.

ఇప్పుడు ఫలితం దారుణంగా వుంది. పెట్టుబడి ఏమాత్రం వెనక్కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అటు శాటిలైట్ లేదు. డిజిటల్ లేదు. ఇటు థియేటర్ కలెక్షన్లు లేవు. సినిమా మీద ప్రేమతో, మహానటి, సమ్మోహనం ఇలా మంచి సినిమాలు ఎంచి ఎంచి ఓవర్ సీస్ లో పంపిణీ చేసి సంపాదించిన డబ్బులు, మను డైరక్టర్ పుణ్యమా అని పోగొట్టుకున్నారు సృజన్. 

అన్నట్లు సినిమా అంటే ప్రేమించి. మంచి సినిమాల ఎంచి ఓవర్ సీస్ కు కొనే సృజన్, గుడ్డిగా మను సినిమాను విడుదల చేసిన సృజన్ వయస్సు జస్ట్ 27 ఏళ్లు.