ఎంసిఎ డిసెంబర్ లో ఎమ్మెల్యే జనవరిలో

హీరో నాని మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసిఎ) అంటూ డిసెంబర్ 21 మీద రుమాలేసాడు. అదే విధంగా కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎమ్మెల్యే) అంటూ జనవరి 26 మీద రుమాలేసే పనిలో…

హీరో నాని మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసిఎ) అంటూ డిసెంబర్ 21 మీద రుమాలేసాడు. అదే విధంగా కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎమ్మెల్యే) అంటూ జనవరి 26 మీద రుమాలేసే పనిలో వున్నాడు. నేను లోకల్ తరువాత దిల్ రాజు హీరో నానితో నిర్మిస్తున్న మరో సినిమా ఎంసిఎ. దిల్ రాజు ఆస్థానంలో ఎన్నాళ్ల నుంచో వుండి అవకాశం కోసం చూస్తున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు.

ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేసారు. ఇప్పటికే ఈ ఏడాది శతమానం భవతి, నేను లోకల్, డిజె, ఫిదా ఇలా నాలుగు సినిమాలు వచ్చాయి దిల్ రాజు బ్యానర్ నుంచి. ఇది కాక జవాన్ రావాల్సి వుంది. అది కూడా వస్తే, ఎంసిఎతో కలిపి ఆరు సినిమాలు అవుతాయి. అంటే సగటున ప్రతి రెండు నెలలకు ఓ సినిమా అన్నమాట.

ఇదిలా వుంటే, కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరక్షన్ లో తయారవుతున్న సినిమా ఎంఎల్ఎ. ఇటీవలే తొలి హిట్ కొట్టిన బ్లూ ప్లానెట్ మూవీస్ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా నవంబర్ నాటికి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. కళ్యాణ్ రామ్ కు పటాస్ తో కలిసి వచ్చిన జనవరి 26న విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నారు.

మొత్తం మీద సెప్టెంబర్ ఫుల్ అయిపోయింది అనుకునంటే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నాలుగు నెలలకు కూడా మెల్లగా సినిమాలు ఫిక్స్ అయిపోతున్నాయి.