దాదాపు ఏడాదిన్నరగా నందమూరి బాలకృష్ణ ఎక్కడ కనిపించినా పేద్ద మీసంతోనే. మధ్యలో పూరి జగన్నాధ్ తో ఓ సినిమా చేసినా కూడా ఆ మీసాన్నే కాస్త అటు ఇటు చేసి కానిచ్చారు. గౌతమీపుత్ర శాతకర్ణి కోసం పెంచిన మీసం అది. ఇప్పుడు ఆ మీసాన్ని తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కోసం త్యాగం చేసేసాడు. మీసం తీసేసి, మనదేశంలో ఎన్టీఆర్ లుక్ కు అనుగుణంగా మీసం సెట్ చేసుకున్నాడు.
వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన రోజే దుర్యోధనుడి గెటప్ వేసుకున్నపుడే వేరే మీసంతో కనిపించాడు. కానీ మళ్లీ ఆ మర్నాటి నుంచీ ఈ శాతకర్ణి మీసంతోనే కనిపిస్తూ వచ్చారు. ఇప్పుడు మొత్తం మీద మీసం తీసేసినట్లు తెలుస్తోంది.
20 కిలోలు మైనస్
గతనెల నెలన్నరగా బాలయ్య కాస్త గట్టిగానే కృషి చేసి, తన బరువు బాగా తగ్గించుకున్నట్లు వినికిడి. దాదాపు 20 కిలోలు తగ్గినట్లు యూనిట్ వర్గాల బోగట్టా. ఇంకా మరికాస్త తగ్గే పనిపై వున్నట్లు తెలుస్తోంది. పైగా వర్క్ కూడా ఆపకుండా చేసేస్తానని క్రిష్ కు మాట ఇచ్చాడట బాలయ్య. నిన్నటికి నిన్న మొదటిరోజే మూడుసీన్లు వరుసగా చేసేసాడట. అన్నపూర్ణలో జరుగుతున్న ఈ షెడ్యూలు అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీకి యూనిట్ షిప్ట్ అవుతుంది. నవంబర్ నెలాఖరుకు టాకీ మొత్తం పూర్తిచేస్తారు.