ఒక్క హిట్టొస్తే చాలు.. ఆ దర్శకుడు రాత్రికి రాత్రి 'స్టార్డమ్' సంపాదించేసుకుంటున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో మరీ వింత పోకడ.. అనుకోలేంగానీ, దర్శకుల కొరత అయితే స్పష్టంగా కన్పిస్తోందిప్పుడు. హిట్టొచ్చే దర్శకుడి వెనకాల పరిగెత్తడం, ఫ్లాపొస్తే పూర్తిగా పక్కన పడేయడం.. మామూలే టాలీవుడ్లో. అయితే, పది సినిమాలు పాతిక సినిమాలు తీస్తే వచ్చే స్టార్డమ్.. ఒకటి రెండు సినిమాలతోనే వచ్చేస్తోన్న రోజులివి.
తాజాగా ఆ స్టార్డమ్ ఇప్పుడు అవసరాల శ్రీనివాస్‌కి వచ్చేసినట్లే కన్పిస్తోంది. 'ఊహలు గుసగుసలాడే' సినిమా తెరకెక్కించాక, వన్ సినిమా వండర్.. అనుకున్నారంతా. 'జ్యో అచ్యుతానంద' వచ్చాక ఒక్కసారిగా అవసరాల శ్రీనివాస్ గురించిన పాత అభిప్రాయం మారిపోయింది. క్లాస్ చిత్రాల స్పెషలిస్ట్ అనిపించేసుకున్నాడు. తన తదుపరి సినిమాని నానితో చేయనున్న అవసరాల శ్రీనివాస్ చుట్టూ ఇప్పుడు నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారట.
టాలీవుడ్లో అవసరాల గురించి హాటెస్ట్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడ్తోంది. మెగా క్యాంప్ నుంచి శ్రీనివాస్ అవసరాలకి బంపర్ ఆఫర్ వచ్చిందట. అదీ నాగబాబు కుమార్తె కోసం.. అనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అల్లు అరవింద్, అవసరాల శ్రీనివాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనీ, తన కుమారుడు అల్ల శిరీష్తోగానీ, నిహారికతోగానీ సినిమా చేయాల్సిందిగా కోరారనీ తెలుస్తోంది. అయితే, అవసరాల శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లపై తొందరపడి ఎలాంటి ప్రకటనలూ చేయడంలేదు.
నానితో సినిమా ఒక్కటే కన్ఫామ్ అయ్యింది.. అది కూడా సెట్స్ మీదకు రావడానికి చాలా టైమ్ పడుతుంది. కమెడియన్‌గా సినిమాలు చేస్తూనే, దర్శకుడిగా సినిమాలకు కమిట్ అవుతానంటున్న అవసరాలని, అంత ఖాళీగా టాలీవుడ్ వుంచుతుందా.?