పోస్టుమార్టం చేయడం మొదలుపెడితే.. నాగబాబు మాట్లో ఎన్నెన్ని బూతులైనా వెదక్కోవచ్చు! గతం, వర్తమానంలోని పరిణామాలను నాగబాబు వ్యాఖ్యానాలతో ముడి పెడితే.. ఆ మాటలను మెగా ఫ్యామిలీకి కూడా వర్తింపజేస్తే.. కథ మరో రకంగా ఉంటుంది! వర్మకు ప్రపంచమంతా లోకువ.. వర్మ ప్రపంచానికంతటికీ లోకువ… అలాగని ఇష్టానుసార పదప్రయోగాల్లో మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సింది.
అవును.. వర్మ వరస ప్లాఫుల్లోనే ఉన్నాడు, ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం కూడా వర్మకు ఉంది. మరి ఫ్లాఫుల్లో ఉన్నాడని, వర్మకు సినిమాలు చేయడం రాదు, పని రాదు.. పని రాని వాడికి వేరే మాటలెందుకు? అన్నట్టుగా నాగబాబు ప్రశ్నించారు కదా, ఫ్లాఫుల్లో ఉన్న ప్రతి వారికి పని రాదు, సత్తా లేదు.. అనుకుంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఫ్లాఫులను ఎదుర్కోలేదా? అంటే, ఆయా సందర్భాల్లో మెగా ఫ్యామిలీకి కూడా శ్రద్ధ లేనట్టేనా?
ఎక్కడి వరకో ఎందుకు.. నాగబాబు నిర్మాతగా తీసిన ఆఖరి సినిమా ఏది? దాని ఫలితం ఏమిటి? మళ్లీ ఎందుకు నిర్మాతగా సినిమా తీయలేకపోతున్నారు? వీటి గురించి వేరే ఎవరైనా మాట్లాడితే ఎంత బాగుండదో, ఆ ఫ్లాఫ్ సినిమాను గుర్తు చేసి.. నాగబాబుకు శ్రద్ధ లేదు, పని చేత కాదు, తన పనేంటో తను చూసుకుంటే బావుంటుందని ఎవరైనా సూచిస్తే.. ఎంత బాగుండదో, వర్మ విషయంలో వేలెత్తి చూపడం కూడా అంతే ఇదిగా ఉంటుంది!
నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా.. అన్నట్టుగా ‘జబర్ధస్త్’ ప్రస్తావన కూడా తీసుకొచ్చేశాడు వర్మ! నీ కెరీర్ ఏంటో నువ్వు చూసుకో.. నాకు ఉచిత సలహాలు వద్దనేశాడు! దేన్నీ వదల్లా. నాగబాబును అవమానించడానికి అన్ని అవకాశాలనూ ఉపయోగించుకున్నాడు వర్మ. మరి దీనికి సమాధానం చెబుతారా? నాగబాబు మళ్లీ స్పందిస్తారా? తరువాయి భాగం మరో ‘మెగా’ ఫంక్షన్ లోనేనా!