బన్నీ చేసిన సినిమాల్లో మ్యాగ్జిమమ్ మూవీస్ వేసవిలోనే వచ్చాయి. కాకపోతే అలా వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాపులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి కూడా సమ్మర్ కే వస్తున్నాడు బన్నీ. నిన్ననే సెట్స్ పైకి వచ్చిన “నా పేరు సూర్య” సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.
నిజానికి సమ్మర్ లో అన్ని నెలల కంటే ఏప్రిల్ నెల బన్నీకి బాగా కలిసొచ్చింది. బన్నీ, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు ఏప్రిల్ లోనే విడుదయ్యాయి. అందుకే వక్కంతం వంశీతో చేస్తున్న “నా పేరు సూర్య” సినిమాను కూడా ఏప్రిల్ లోనే విడుదల చేయాలని నిర్ణయించాడు.
నిజానికి “నా పేరు సూర్య” సినిమాకు అంత టైం అవసరంలేదు. ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ కూడా పెద్దగా లేదు. కావాలనుకుంటే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయొచ్చు. కానీ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ నెలకు వెళ్లారని తెలుస్తోంది.
బన్నీ, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నిన్నట్నుంచి సెట్స్ పైకి వచ్చింది ఈ సినిమా. త్వరలోనే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్ము రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నాడు బన్నీ. దీనికోసం అమెరికా నుంచి ఓ ఫిజికల్ ఫిట్ నెస్ ట్రయిలర్ ను హైదరాబాద్ కు రప్పిస్తున్నారు.