ఒకే కుటుంబం నుంచి చాలా మంది హీరోలుంటే రిలీజ్ ప్లానింగ్ పరంగా ఇబ్బందులు తప్పవు. ఒక్కోసారి ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యేందుకు సిద్ధపడవచ్చు. అలాంటి సమయంలో రెండు సినిమాల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది అభిమానులకి హెడ్డేక్ అవుతుంది. ఇప్పటివరకు తమ సినిమాల మధ్య క్లాష్ లేకుండా చూసుకున్న మెగా హీరోల మధ్య ఈసారి పోటీ అనివార్యమయింది.
సాయి ధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్', వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ఒకేసారి రిలీజ్‌కి సిద్ధపడడంతో ఒక్క రోజు గ్యాప్ పాటిస్తున్నారు. ఎన్నో కోట్ల బిజినెస్ ఆధారపడిన సినిమాలకి
ఒక రోజు వ్యవధి వల్ల ఒరిగేది వుండదు. కీలకమైన వీకెండ్ వసూళ్లని రెండు సినిమాలు షేర్ చేసుకోవాల్సి వుంటుంది. ఇది సఖ్యంగా వున్న హీరోల మధ్య చిక్కులు తెచ్చి పెట్టే ప్రమాదముంది.
వేసవిలో రాబోతున్న రంగస్థలం, నా పేరు సూర్య మధ్య కూడా వ్యవధి ఎక్కువ వుండాలని అభిమానులు కోరుతున్నారు. రెండిటి మధ్య రెండు వారాల గ్యాప్ కాకుండా కనీసం నాలుగు వారాల గ్యాప్ వుండాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి ఆ చిత్రాల నిర్మాతలు చివరకు ఎంత గ్యాప్ పాటిస్తారనేది తెలియదు కానీ మొత్తం మీద మంది ఎక్కువైన మెగా కుటుంబంలో ఇప్పుడు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి.
ఇకపై తమ సినిమాల రిలీజ్ ప్లానింగ్ పరంగాను ఒకరితో ఒకరు చర్చించుకోక తప్పదేమో మరి.