మెగా కిరీటం బన్నీకే

రూట్ క్లియర్ అయిపోయింది. ఇన్నాళ్లుగా మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ క్యాంప్ లో, ఆ అభిమానుల్లో ఆ లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తారన్న దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ వుండేది. అటు పవన్ కళ్యాణ్, ఇటు…

రూట్ క్లియర్ అయిపోయింది. ఇన్నాళ్లుగా మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ క్యాంప్ లో, ఆ అభిమానుల్లో ఆ లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తారన్న దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ వుండేది. అటు పవన్ కళ్యాణ్, ఇటు బన్నీ, మధ్యలో రామ్ చరణ్ వున్నారు. ఇక ఇప్పుడు బన్నీనే మెగా క్యాంప్ లో లీడ్ యాక్టర్ అనడంలో సందేహం లేదు. గంగోత్రి నుంచి సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వరకు బన్నీ తనను తాను తీర్చుకుంటూ, మార్చుకుంటూ వస్తున్నాడు.

మెగా స్టార్ తరువాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిది ఇద్దరే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. రామ్ చరణ్ కు కూడా ఇంతో అంతో ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా, వీళ్ల ఇద్దరికి వున్నట్లు ఆ ఫాలోయింగ్ ను మెగాస్టార్ ఫాలోయింగ్ తో విడదీసి చూడలేం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ అభిమానులు ఆయన రాజకీయ అభిమానులుగా వుండాల్సిందే. లేదా మెగాభిమానాన్ని బన్నీ వైపు మార్చుకోవాలి. రాజకీయంగా పవన్, సినిమాల్లో బన్నీ అన్నట్లుగా అభిమానుల అభిరుచులు మారాలి.

రామ్ చరణ్ రంగంలో వున్నా, బన్నీతో చాలా తేడా వుంది. రామ్ చరణ్ సినిమాలు చేస్తాడు. సిన్సియర్ గానే చేస్తాడు. కానీ బన్నీ మాదిరిగా ఓ గోల్ పెట్టుకుని, ఓ స్థాయికి చేరుకోవాలి. అందుకోసం ఇలా విభిన్నంగా ప్రయత్నించడం అన్నది మొదటి నుంచీ అలా కనిపిస్తూవుంటుంది. ఇప్పుడు నిజానికి పెద్ద డైరక్టర్ల లైనప్ అంటూ బన్నీకి లేకపోవచ్చు. కానీ పరిస్థితి మారడానికి ఎంతో కాలం పట్టదు.

కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి అలాగే వుండేది. కానీ వున్నట్లుండి మొత్తం సీన్ మారిపోయింది. అంతా పాజిటివ్ అయిపోయింది. నందమూరి అభిమానులు, ఓ సామాజిక వర్గ అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ వెనుక చేరిపోయారు. తమ సూపర్ స్టార్ అతనే అని ఫిక్స్ అయిపోయారు.

ఇప్పుడు మెగాభిమానులు కూడా ఇలాగే మెల్లగా బన్నీ వెనుక చేరతారు. ఒకటి రెండు సరైన బ్లాక్ బస్టర్లు ఇస్తే, బన్నీనే మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే హీరోగా మిగులుతాడు. చరణ్ ను పక్కన పెడితే, మిగిలిన మెగా హీరోలు ఇంకా చాలా దూరంలో వున్నారు. బన్నీ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

నిన్నటికి నిన్న మీడియాను సెట్ కు పిలిపించి, అందరినీ పలకరించి, సంబంధాలు నిర్మేంచే పనిలో పడ్డాడు. ఈ మధ్యకాలంలో ఏ పెద్ద హీరో కూడా మీడియాను సెట్ మీదకు పిలిచే పని చేపట్డడం లేదు. గతంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలంలో ఇలాంటివి జరిగేవి. పవన్ సినిమాల మీద విరక్తి ప్రకటించడం, బన్నీ సెట్ మీదకు మీడియాను పిలిచి ఇంటరాక్ట్ కావడం, రెండూ ఒకేసారి జరగడం యాధృచ్ఛికం కావచ్చు, కానీ కాస్త పరిశీలించదగ్గ అంశాలే.

బన్నీకి ఇప్పుడు 70కోట్ల స్థిరమైన మార్కెట్ వుంది. అటు మళయాళం, ఇటు కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు ఓకె. తమిళ్ లో కాస్త గట్టిగా వర్కవుట్ చేయాల్సి వుంది. అది కూడా పూర్తయితే కచ్చితంగా రాబోయే కాలంలో మెగా కిరీటం బన్నీదే.