పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నానని ప్రకటించేసి, ఆ తర్వాత కథ కుదరలేదని చిరంజీవి చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. వాస్తవానికి పూరి జగన్నాథ్ తక్కువోడేమీ కాదు. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తొలి సినిమాకి దర్శకత్వం వహించాడు. హిట్లు, ఫ్లాపుల సంగతెలా వున్నా.. శరవేగంగా సినిమాలు తీసే సత్తా వున్నోడు. అవసరమైతే స్వీయ దర్శకత్వంలో సినిమాలు కూడా నిర్మించుకోగలడు.
ఆ లెక్కన, పూరి జగన్నాథ్‌కి మెగా క్యాంప్ నుంచి అవమానమే జరిగింది. సినిమా చేస్తున్నానని చెప్పి, కథ విషయంలో పూరిని పక్కన పడేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలా, పూరి విషయంలో మెగా క్యాంప్ పెద్ద తప్పే చేసిందనే వాదన టాలీవుడ్‌లో బలంగా విన్పిస్తోంది. దాంతో, చిరంజీవి పరిస్థితిని సమీక్షించి, అర్థం చేసుకుని.. పూరితో సినిమా చేయాలనే నిర్ణయానికే మొగ్గు చూపారట.
ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న చిరంజీవి, ఆ తర్వాత పూరి దర్శకత్వంలో సినిమా చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వినాయక్ కూడా ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక, వినాయక్‌తోనే సినిమా చేయబోతున్నానని ప్రకటించారు. 'అన్నయ్య సినిమాల్లోకి మళ్ళీ వస్తే, రీ-ఎంట్రీ ఇచ్చే చిత్రానికి నేనే దర్శకుడ్ని..' అంటూ వినాయక్ చెప్పేసుకున్నాడు. కానీ, ఈలోగా పూరి జగన్నాథ్ పేరుని చిరంజీవి తెరపైకి తెచ్చారు.
అఫ్‌కోర్స్.. ముందుగా అనుకున్నట్లు వినాయక్‌కే చిరంజీవి ఓటేశారనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడేమో పూరిని కూడా చిరంజీవి లైన్‌లో పెట్టడం చూస్తోంటే 'మెగాస్టార్ డ్యామేజీ కంట్రోల్ స్ట్రేటజీ' ఏ స్థాయిలో వర్కవుట్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు. సినీ రంగంలో ఎవర్నీ నొప్పించని నైజం చిరంజీవిది.. అన్న ఇమేజ్‌ని నిలబెట్టుకోడానికి, చిరంజీవి ఇలాంటి స్ట్రేటజీలు అమలు చేస్తున్నారన్నమాట. ఇంతకీ, పూరి వైపునుంచి మెగా సినిమాపై క్లారిటీ ఎప్పుడొస్తుందో.!