మూడునెలల్లో బిజెపి ముద్దొచ్చేస్తోంది

మన నాలుక.. మన ఇష్టం. అలాగే మన రాతలు..మన ఇష్టం. నాలుగు నెలల క్రితం వరకు భాజపా అంటే అంటరాని పార్టీ. తెలుగుధేశం పార్టీ విడాకులు ఇచ్చింది కాబట్టి, జనాలకు కూడా పనికిరాదు. అలాగే…

మన నాలుక.. మన ఇష్టం. అలాగే మన రాతలు..మన ఇష్టం. నాలుగు నెలల క్రితం వరకు భాజపా అంటే అంటరాని పార్టీ. తెలుగుధేశం పార్టీ విడాకులు ఇచ్చింది కాబట్టి, జనాలకు కూడా పనికిరాదు. అలాగే తేదేపా అను'కుల' మీడియాకు కూడా అస్సలు పనికిరాదు. 

2014 నుంచి కొన్నేళ్లపాటు భాజపా ముద్దు వచ్చింది. ఎప్పుడు అయితే సీనియర్ భాజపానేత వెంకయ్య నాయుడును క్రియాశీలక రాజకీయాలకు దూరం చేసారో, అప్పటి నుంచి భాజపా అంటే అలక వచ్చింది. ఎప్పుడయితే తేదేపా తనంతట తాను విడాకులు ఇచ్చిందో, అప్పటి నుంచి భాజపా అంటే ఆగ్రహం పుట్టుకువచ్చింది.

అప్పుడు ప్రారంభమైన ఆగ్రహం ఎన్నికల వేళకు అసహ్యంగా మారింది. ఇక చూస్కోండి నా రాజా, తేదేపా అను'కుల' మీడియాలో మోడీ, అమిత్ షా అనే ఇద్దరిని దుయ్యబట్టిన తీరు ఇంతా అంతా కాదు. ఉతికి ఆరేసిన వైనం ఇలాంటిది అలాంటిది కాదు. అదే సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ కొంగు పట్టుకుని దేశం అంతటా కలియ తిరిగేవారు. అందువల్ల కాంగ్రెస్ ను భుజనా వేసుకుని, భాజపాను దుయ్యబట్టడమే పనిగా వుండేది.

కానీ, విధి విచిత్రమైనది. కాంగ్రెస్ కు, చంద్రబాబుకు కూడా దారుణ పరాభవం కలిగింది ఎన్నికల్లో. అప్పుడు జ్ఞానోదయం అయింది. భాజపా శరణం మమ అన్న అనివార్య కార్యక్రమం ప్రారంభమైంది. అక్కరకు రాని చుట్టాన్ని చటుక్కున వదలాలన్న సూత్రం ప్రకారం కాంగ్రెస్ ను వదిలేసారు చంద్రబాబు. భాజపాను మంచి చేసుకునే పనిలోపడ్డారు. తనవాళ్లు అనుకునే వారిని భాజపాలోకి పంపించే కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ నుంచి భాజపాకు వైకాపాకు ఎడం పెంచే పని మొదలైంది.

ఇప్పుడు ఇక భాజపాను పొగిడే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసారు. కాశ్మీర్ పై నిర్ణయాల తరువాత భాజపా అంటే పల్లె పల్లెల్లో కూడా ఇష్టం పెరిగిపోయిందట. తెగ మోజు పడిపోతున్నారట. ఈ ముక్క అంటున్నది వేరెవరో అంటే ఆశ్చర్యంలేదు. కానీ తేదేపా అనుకూల మీడియానే అనడం విశేషం. అంటే ఇక భాజపాను లేపే కార్యక్రమం మొదలుపెడుతున్నారన్నమాట. అక్కడ నుంచి ప్రారంభమై, భాజపా-వైకాపాలను విడగొట్టి, భాజపా-తేదేపాలకు మళ్లీ మరోసారి ముడిపెట్టే వరకు ఈ కార్యక్రమం ఇలాగే సాగుతుంటుంది.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, మా అధికార సాధన, మా రాతలు కాక మాకేటి వెరపు అన్నట్లు వుంటుంది తేదేపా అను'కుల' మీడియా వైఖరి.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?