సినీ నటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య ఇంకా మిస్టరీగానే వుంది. ఆర్థిక ఇబ్బందులు, సినిమాల్లో అవకాశాలే అతని ఆత్మహత్యకు కారణం అని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినా, కేవలం అవే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొంది.
ఎందుకంటే ఉదయ్‌కిరణ్ స్వతహాగా ధైర్యవంతుడని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఉదయ్‌కిరణ్ సతీమణి తప్ప, అందరిదీ అదే మాట. ఉదయ్‌కిరణ్‌తో సినిమాలు చేసినవారు, ఉదయ్‌కిరణ్‌ని చూసి, అతని మేనేజర్‌కి 17 లక్షలు అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్, ఉదయ్‌కిరణ్ మేనేజర్‌గా పనిచేసిన మున్నా.. ఇలా ఎవరు చెప్పినా, అందరూ ఉదయ్‌కిరణ్ ధైర్యం గురించి ఏమాత్రం తేడాగా చెప్పడంలేదు.
ఆత్మహత్య పరికిపందల చర్య.. అని చెబుతారు. అలా చెప్పడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఏ మూల వున్నా, వారు ధైర్యంగా వుంటారనేది మానసిక విశ్లేషకుల వాదన. ఆ విషయం పక్కన పెడితే, తీవ్రమైన మానసిక వేదనతోనే ఎక్కువమంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కాబట్టి, ఉదయ్‌కిరణ్ మానసిక వేదన చివరి రోజుల్లో అనుభవించాడన్నది నిర్వివాదాంశం.
ఉదయ్కిరణ్కి హైద్రాబాద్‌లో పలు చోట్ల ఆస్తులున్నాయని ఆయన భార్య చెబుతున్న దరిమిలా, అతనికి ఆర్థిక ఇబ్బందులు లేవనే అర్థమవుతోంది. అవకాశాల విషయానికొస్తే, సినీ పరిశ్రమలో ఎవరికీ నిత్యం అవకాశాలు వుంటాయని చెప్పలేం. ఒక్కొక్కరికీ ఒక్కో టైమ్.. ఆ టైమ్‌లో ఆయా వ్యక్తులు తమ సత్తా చాటుకుంటుంటారు.
కొందరు హీరోలుగా తిరుగులేని ఇమేజ్ సృష్టించుకున్నా, ఒక్కోసారి భారీ స్లంప్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ లెక్కన, సినీ ప్రముఖులకి అవకాశాల పరంగా టెన్షన్ అనేది సర్వసాధారణం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉదయ్‌కిరణ్ మరణం వెనుక ఏదో బలమైన కారణం వుండే వుండాలి. అదేంటి.? ఆ ఒక్కటీ ప్రస్తుతానికి సస్పెన్స్.
చరిత్రను తిరగేస్తే చాలామంది తారలు అర్థాంతరంగా తనువు చాలించారు.. వారి మరణాలు చాలావరకు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వ్యవహారం కూడా మిస్టరీగా మిగిలిపోయేందుకే అవకాశాలున్నాయి.