నాపేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రెండు ఆశ్చర్యాలు. ఒకటి అల్లు అరవింద్ మాట్లాడుతూ, తెరవెనుక చాలా జరిగాయి అని చెప్పడం. రెండవది టీవీ-9 చానెల్ కు లైవ్ వుండదు అనుకుంటే లైవ్ వుండడం. ఈ రెండు విషయాలు కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేవే.
టీవీ-9 మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతలా ధ్వజమెత్తిన తరువాత అల్లు అరవింద్, నాగబాబు కలిసి, ఇలా చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా నా పేరు సూర్య కోసం చేస్తున్న తెరచాటు పాంపరింగ్ అని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే అని నా పేరు సూర్య యూనిట్ లోని కీలక బాధ్యులు తెలియచేసారు.
నా పేరు సూర్య ప్రీ రిలీజ్ లైవ్ కాస్ట్ తమకు కూడా ఇవ్వమని టీవీ-9, టీవీ-5 చానెళ్లు నిర్మాతల మీద తీవ్ర వత్తిడి తెచ్చినట్లు బోగట్టా. దానికి యూనిట్ కీలకబాధ్యులు, ఇదిగో అదిగో అని సాగదీసి, ఆఖరికి సాయంత్రం అయిదు తరువాత, 'సారీ' అని మెల్లగా చెప్పారట. సరే, ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఇంతలో బయట నుంచి ఎవరో ఫోన్ చేసి టీవీ-9లో లైవ్ వస్తోంది అని చెప్పారట. దీంతో ఆశ్చర్యపోయిన యూనిట్ జనాలు చానెళ్ల సంబంధీకులకు పోన్ చేసి, దయచేసి లైవ్ ఆపమని, అలా చేయడం వల్ల తమకు సమస్యలు వస్తాయిని చెప్పినట్లు వినికిడి. కానీ లైవ్ ఆగలేదు.
దీంతో అల్లు అరవింద్ తన స్పీచ్ లో అలా మాట్లాడక తప్పలేదని, పైగా పదే పదే స్టేజ్ మీద లైవ్ ను ఎన్టీవీకి, మరో చానెల్ కు ఇచ్చినట్లు చెబుతూ వచ్చారు. ఎక్కడా టీవీ-9 పేరు ప్రస్తావన లేదు. సినిమా ప్రకటనలు కూడా టీవీ-9తో పాటు మరో రెండు చానెళ్లకు ఇవ్వలేదని, అలాంటిది లైవ్ హక్కులు ఎలా ఇస్తామని ఎన్పీఎస్ యూనిట్ వర్గాల ప్రశ్నించాయి.
వేరే చానెల్ నుంచి కానీ, లేదా యూట్యూబ్, ఫేస్ బుక్ నుంచి కానీ ఏదో విధంగా సాంకేతికత వాడి ఆ చానెల్ అలా చేసి వుండొచ్చని యూనిట్ వర్గాల బోగట్టా. అందుకే మిగిలిన లైవ్ చానెళ్లకు, టీవీ-9కు కొద్ది సెకెండ్ల తేడా వున్న సంగతిని గుర్తు చేసారు.
సరే, లైవ్ అయిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అరవింద్ నే ఇచ్చేసారని ఇప్పుడు బయటకు కథనాలు వచ్చాయి. దీంతో పవన్ దగ్గర డ్యామేజీ. అందుకే ఎన్పీఎస్ కు చెందిన కీలక వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ మొత్తం ఉదంతం వివరిస్తున్నారట. మొత్తానికి ఏదో జరుగుతోంది. ఎన్పీఎస్ కు వ్యతిరేకంగా. ఫ్యాన్స్ పహరా హుషార్ అంటున్నారు నిర్మాత బన్నీ వాస్.