సినిమాల సంగతి పక్కనపెడితే నాగశౌర్యకు శాటిలైట్ మార్కెట్ పెద్దగాలేదు. అతడు నటించిన సినిమాలేవీ ఇప్పటివరకు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోలేదు. అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఛలో కూడా ఓ మోస్తరు రేటుకే అమ్ముడుపోయింది. కానీ ఛలో ఇచ్చిన ఉత్సాహంతో ఈ హీరో ఇప్పుడు టీవీ ఛానెళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
తన సొంత బ్యానర్ పై ఛలో సినిమా చేసిన నాగశౌర్య, ఇప్పుడు అదే బ్యానర్ లో నర్తనశాల అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సేమ్ టైం శాటిలైట్ మార్కెట్ ఓపెన్ చేశారు. అయితే నాగశౌర్య చెప్పిన రేటుకు టీవీ ఛానెళ్ల కళ్లు బైర్లుకమ్మాయి.
అవును.. నర్తనశాల సినిమాకు ఏకంగా 4కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు నాగశౌర్య. గతంలో 4కోట్ల కంటే తక్కువ బడ్జెట్ లోనే నాగశౌర్య సినిమా పూర్తిచేసిన సందర్భాలున్నాయి. అలాంటిది నర్తనశాలకు కేవలం శాటిలైట్ రైట్స్ కే ఇంత మొత్తం చెప్పడంతో యాజమాన్యాలు ఖంగుతిన్నాయి. కొన్ని టీవీ ఛానెల్స్ అయితే సంప్రదింపులు కూడా ఆపేశాయి.
నిజానికి ఛలో తర్వాత వరుసగా ఫ్లాపులిచ్చాడు నాగశౌర్య. కణం సినిమా ఒక్కరోజు కూడా ఆడలేదు. అమ్మమ్మగారిల్లు సినిమాదీ ఇదే పరిస్థితి. ఈ రెండు ఫ్లాపుల్ని చాకచక్యంగా సైడ్ చేసేసి, కేవలం ఛలో సినిమానే పదేపదే తెరపైకి తీసుకొస్తున్నాడు నాగశౌర్య. అలా నర్తనశాలకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఏ ఛానెల్ దక్కించుకుంటుందో, ఎంతకు తీసుకుంటుందో చూడాలి.