సంక్రాంతికి విడుదల కానున్న ప్రధానమైన నాలుగు సినిమాల కనీస టార్గెట్ 140 కోట్ల రూపాయలు! బాబాయ్ – అబ్బాయ్ ల మధ్య పోటీతో బాక్సాఫీసు పోరు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఈ పండగ సందర్భంలో అన్నీ కలిపి..మినిమం 140 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే.. తప్ప సాఫీగా బయటపడని పరిస్థితి కనిపిస్తోంది. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయన రూపంలో మొత్తం నాలుగు సినిమాలు ఈ పండగ బరిలో ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు.
వీటి ప్రీ రిలీజ్ మార్కెట్ ను పరిశీలిస్తే… ఎన్టీఆర్ సినిమా రూ.50 కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. ఇక బాలయ్య సినిమా “డిక్టేటర్ '' రూ.40 కోట్ల స్థాయిలో ఉంది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత ప్రేక్షకులను పలకరిస్తున్న నాగార్జున తన సినిమాతో రూ30 కోట్ల రూపాయల బిజినెస్ మార్కును అందుకున్నారు. ఇక హిట్ సినిమా డైరెక్టర్, హిట్ల మధ్య ఉన్న హీరోల కాంబోలో వస్తున్న 'ఎక్స్ ప్రెస్ రాజా' విడుదలకు ముందు బిజినెస్ లో రూ.20 కోట్ల రూపాయల మార్కును అందుకుంది!
ఈ రకంగా చూస్తే.. ఈ సినిమాలన్నీ కలిపి విడుదలకు ముందు రూ.140 కోట్ల రూపాయల మార్కును అందుకున్నాయి. కనీసం ఆ స్థాయి వసూళ్లను సాధించకపోతే తప్ప ఈ సినిమాలకు 'హిట్' ముద్ర పడదు. ప్రధానంగా ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో' మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది. తన కెరీర్ లో ఇంత వరకూ యాభై కోట్ల రూపాయల మార్కును అందుకోలేకపోయాడు ఎన్టీఆర్. ఈ సారైనా ఆ వసూళ్ల మార్కును అందుకుని ఎన్టీఆర్ సత్తా చాటాల్సి ఉంది. ఇక బాలయ్య సినిమా రూ.40 కోట్ల రూపాయల మార్కును అందుకొంటే తప్ప తన సినిమా హిట్ అనిపించుకోలేడు. ఇక ఇప్పటికే విడుదల జాప్యంతో 'సోగ్గాడే చిన్ని నాయన' బడ్జెట్ పై వడ్డీలు పెరిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో కనీసం ముప్పై కోట్ల రూపాయల మార్కును రీచ్ అయ్యే అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాడు నాగ్.
ఇక మేర్లపాక గాంధీ, శర్వానంద్ ల కాంబోలో వస్తున్న 'ఎక్స్ ప్రెస్ రాజా' పై ఉన్న పాజిటివ్ అంచనాలకు ఆ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ రూ.20 కోట్ల రూపాయల చేరడమే నిదర్శనం. మరి వసూళ్లలో కూడా ఆ స్థాయిని అందుకోకతప్పని పరిస్థితి ఉంది. మదగజల్లాంటి సినిమాల మధ్య ఈ సినిమా ఆ లక్ష్యాన్ని సాధిస్తే.. నిజంగా అది వండరే! ఇదీ సంక్రాంతి సీజన్ లో విడుదల అవుతున్న సినిమాల ఆర్థిక లక్ష్యాలు. వీటిలో ఏది లక్ష్యాన్ని అందుకుంటుందో.. ఏది సత్తా చాటుతుందో చూడాలి!