మాకెందుకు నంది అవార్డులు దక్కలేదు? అని ప్రశ్నిస్తున్న వాళ్ల దగ్గర విషయం ఉంది. లెజెండ్ కు నంది అవార్డులు ధారపోశారు సరే.. మీ వాళ్లకు మీరు ఇచ్చుకున్నారు, మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు.. అని బాహాటంగా ధ్వజమెత్తుతున్న వాళ్లు ఊరికే ఏదో అర్రీబుర్రీగా మాట్లాడటం లేదు. వాళ్ల వాయిస్ లో నిజాయితీ ఉంది. మంచి సినిమాలు తీశాం కదా.. మా కెందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తున్న వాళ్ల దగ్గర నిజంగానే మంచి సినిమాలున్నాయి.
అందుకే.. వాళ్ల వాయిస్ కు ఇప్పుడు అవార్డుల కమిటీలోని వాళ్లు ఉలికి పడుతున్నారు. మూడేళ్ల నందీ అవార్డుల జాబితాలో అన్యాయానికి గురి అయ్యామని చెబుతున్న వారు ప్రస్తావిస్తున్న సినిమాల పేర్లు.. ప్రత్యేకమైనవే. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు ఒకే ఒకటి దక్కిందని, అది అందులో నటించిన వెన్నెల కిషోర్ కి మాత్రమేనని.. ఆ సినిమాకు ఎందుకు మరే విభాగంలోనూ.. కీలకమైన విభాగాల్లోనూ అవార్డు దక్కలేదు? అనేది మొదటగా వినిపించిన ప్రశ్న.
ఆ తర్వాత ‘లౌక్యం’లో తన కామెడీకి ఎందుకు అవార్డు రాలేదు అని.. పృథ్వీ ప్రశ్నించాడు. ఆ సినిమాలో అతడు ఎంతగా నవ్వించాడో వేరే చెప్పనక్కర్లేదు. మరి తనకెందుకు రాలేదు అని అతడు ప్రశ్నించడంలో న్యాయం ఉంది.
ఇలా ప్రశ్నించిన వాళ్లలో ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా నిర్మాత కూడా ఉన్నారు. ఈ సినిమా కూడా ప్రత్యేకమైనదిగా నిలిచింది. వైవిధ్యమైన ప్రయోగంగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా నిర్మాత అయితే మరో అడుగు ముందుకు వేసి.. అవార్డులను తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చుకోవాల్సింది.. అని వ్యాఖ్యానించాడు. ఇక అదేమని ప్రశ్నిస్తే.. కమిటీ సభ్యులు బూతులు తిడుతున్నారు. నీఛమైన వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ల మాటలు వింటుంటే.. వీళ్లా కమిటీ సభ్యులు, ఇలాంటి వారి నుంచి ఇంత కన్నా ఏం ఎక్స్ పెక్ట్ చేయగలం? అనే ప్రశ్న సోషల్ మీడియా నుంచి వ్యక్తం అవుతోంది.