నంది మనకూ వుంది కేసిఆర్ సాబ్

నీ ఎడం చేయి తీయి..నా పుర్ర చేయి పెడతా అన్నట్లు వుంది తెలంగాణ వ్యవహారం. సినిమా నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డుల ప్రవేశపెడతారట. అసలు నంది అవార్డులు అన్నది మార్చాల్సిన అవసరం ఏమిటో?…

నీ ఎడం చేయి తీయి..నా పుర్ర చేయి పెడతా అన్నట్లు వుంది తెలంగాణ వ్యవహారం. సినిమా నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డుల ప్రవేశపెడతారట. అసలు నంది అవార్డులు అన్నది మార్చాల్సిన అవసరం ఏమిటో? అర్థం కాదు. నంది ఏమీ విభజన పంపకాల్లో ఆంధ్రకు వెళ్లిపోలేదు. 

తెలంగాణ నంది అవార్డులు, ఆంధ్ర నంది అవార్డులు అని చెప్పుకుంటే తప్పేమీ లేదు. పోనీ నంది అనేది తెలంగాణకు పూర్తిగా అపరిచితం, మహానంది మాత్రమే నంది అనుకుందామా? రామప్ప బసవన్న రంకె వేసేను అన్నది మరిచిపోయారా? రామప్పలో నంది ఎంత సొగసుగా, అందంగా, అద్భుతంగా వుంటుందో తెలంగాణ జనాలకే కాదు, ఆంధ్ర జనాలకు కూడా తెలిసిందే కదా. కళ నటరాజ స్వరూపం. బసవన్న కూడా జానపదా కళా రూపంలో భాగం. కానీ సింహం అలా కాదు. అధికార దర్పం తప్ప దానికి వేరే 'కళ' యేమీ లేదు. 

పైగా తెలంగాణ అంటేనే జానపద, గ్రామీణ కళారూపాలకు పెట్టింది పేరు. నంది పేరు ఇష్టం లేకపోతే, బసవన్న అవార్డులు అనండి..తప్పేం లేదు.అది ఎబ్బెట్టుగా వుంటుంది అంటే మరో మంచి తెలంగాణ జాణ తెలుగుపదం ఏదయినా కాయిన్ చేయండి. అవేవీ తట్టకపోతే..తెలంగాణ సినిమా అవార్డులు అనేయండి సింపుల్ గా. అంతే కానీ ఈ సింహా అవార్డులు ఏమిటి?