ఛలో సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది హీరో నాగశౌర్య ఫ్యామిలీ. కొడుకు కెరీర్ కు బూస్ట్ అందించడం కోసం, ఫ్యామిలీ స్వయంగా రంగంలోకి దిగి, అనుభవం అస్సలు లేకున్నా, ఓ మంచి సినిమా తీసి, బాగా మార్కెట్ చేయడం కాకుండా, అద్భుతంగా ప్రమోట్ చేసి, విజయం సాధించింది.
ఇదే రూట్ లో మరో సినిమాకు శ్రీకారంచుట్టారు. ఒక విధంగా ఇది మంచి పద్దతే. ఎందుకంటే అయిదారు కోట్లలో సినిమా తీసి, హీరో రెమ్యూనిరేషన్ కలిపి మార్కెట్ చేసుకుంటే, హీరోకు మంచి సినిమా వచ్చినట్లు అవుతుంది. రెమ్యూనిరేషన్ వచ్చినట్లు అవుతుంది.
వాస్తవానికి ఐరా క్రియేషన్స్ ఆ రూట్ లోనే వెళ్తున్నట్లు కనిపించింది. కానీ ఎక్కడ తప్పటడుగు పడింది అంటే హీరో స్టామినాను ఎక్కువ అంచనా వేసుకోవడంలో. అదే విధంగా కొత్త డైరక్టర్ తెచ్చిన స్క్రిప్ట్ ను మరింత ఎక్కువగా అంచనా వేసుకోవడం.
ఎలాంటి హీరో అయినా, సినిమాకు ప్యాడింగ్ అన్నది చాలా అవసరం. అది మహేష్ బాబు అయినా ప్రభాస్ అయినా. అలాంటిది నాగశౌర్య సినిమాకు దాదాపు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వాళ్లందరినీ పట్టుకు వచ్చారు. ఎప్పుడో జనాలు మరిచిపోయిన తిరుపతి ప్రకాష్, గుండు జగన్, జెమిని సురేష్, ఇలాంటి వాళ్లను తీసుకువస్తే, ఈ జనరేషన్ జనాలు ఎందుకు చూస్తారు.
వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్ లాంటి కమెడియన్ల తరం నడుస్తోంది ఇప్పుడు. ఇక శివాజీ రాజా. అతగాడిదీ కీలకమైన పాత్రే. సీనియర్ నరేష్, రావు రమేష్ లాంటి ఉద్దండులు వుంటే శివాజీ రాజాను తీసుకోవడం అంటే మిస్ కాస్టింగ్ కాక ఏమనుకోవాలి? ఇక జ్యోతి కూడా అంతే అమ్మ పాత్రలకు ఇవ్వాళ పవిత్రా లోకేష్ వాళ్లను చూస్తున్నారు జనం. టీజర్ లో శివాజీరాజా ' నా కొడుకు గేనా? అంటూ పెదవి కొరికి, కన్ను కొట్టినపుడే, సినిమాలో ఆయన ఎంత ఓవర్ యాక్షన్ చేసి వుంటాడో అర్థం అయిపోయింది జనాలకు.
టీజర్, ట్రయిలర్ ను చూసి ఓ అంచనాకు వచ్చి కదా జనాలు థియేటర్ కు వచ్చేంది. మరి శివాజీరాజా అద్భత అభినయం టీజర్ లో చూసాక ఎందుకు వస్తారు? సినిమా పబ్లిసిటీకి మూడున్నర కోట్లు ఖర్చు చేసారు. మంచిదే. కానీ అదే కాస్త తగ్గించుకుని కాస్టింగ్ మీద ఖర్చుచేసి వుంటే ఫలితం మరికాస్త మెరుగ్గా వచ్చి వుండేది. అదే విధంగా స్క్రిప్ట్ విషయంలో కొత్త డైరక్టర్ ను పూర్తిగా నమ్మేయకుండా కాస్త దాని మీద వర్క్ చేసి వుంటే అవుట్ పుట్ బాగుండేది.
అన్నింటికి మించి గే క్యారెక్టర్ చేయాలి అనుకున్నపుడే హీరోయిజం పక్కన పెట్టాలి. రెండు మ్యాచ్ అయ్యే వ్యవహారాలు కావు. ఇవన్నీ ఇలా వుంచితే మార్కెట్ ను బట్టే సినిమాకు ఖర్చుచేయాలి. నాగశౌర్య మార్కెట్ బ్లాక్ బస్టర్ అయితే పది నుంచి పదిహేను కోట్లు వస్తుంది. అందువల్ల ఆరేడు కోట్లలో సినిమాను అన్నీ కలిపి ఫినిష్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు చేసేసారు.
కాస్టింగ్ కనిపించడం లేదు. ఖర్చు కనిపిస్తోంది. అదే అసలు సమస్య. ఐరా క్రియేషన్స్ తరువాత సినిమాకు శ్రీకారం చుడుతోంది. ఈసారి అయినా కేవలం నాగశౌర్య మీద భరోసా అయిపోకుండా, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ల విషయంలో కేర్ తీసుకోవడం, స్క్రిప్ట్ పక్కాగా వుండేలా చూసుకోవడం అవసరం.
ఇదిలా వుంటే నర్తనశాలకు ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులకు గట్టిగా కోటి పాతికలక్షల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఇది చాలా పెద్ద పరాజయం కింద లెక్క. మహా అయితే ఇంతకు మించి లాంగ్ రన్ లో కూడా షేర్ వచ్చే అవకాశం వుండదు. ఎందుకంటే సినిమాల మీద సినిమాలు వచ్చి పడుతున్నాయి. వచ్చే కలెక్షన్లు థియేటర్ల అద్దెల ఖర్చులకే పోతాయి.